తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

శిర్డీ సాయి దివ్య సందేశం - శ్రద్ధ, సబూరి ఉంటే చాలు - భగవంతుని చేరుకోవడం ఖాయం! - SHIRDI SAIBABA

విశ్వశాంతికి సాయినాథుని దివ్య సందేశం - 'సబ్‌కా మాలిక్‌ ఏక్‌ హై'- శిర్డీ సాయిబాబా బోధనలివే!

Shirdi Saibaba
Shirdi Saibaba (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2025, 5:31 AM IST

Shirdi Saibaba Story : "సబ్‌కా మాలిక్‌ ఏక్‌" సాయినాధుని ఈ సందేశం విశ్వశాంతికి దోహదం చేస్తుంది. ఈ ప్రపంచంలో కుల మతాలు వేరైనా దేవుడు మాత్రం ఒక్కడే. శ్రద్ధ సబూరి అనే రెండు మాటలే ఆయుధాలుగా మానవాళిలో ఆధ్యాత్మిక భావాలను రేకేత్తించిన శిర్డీ సాయినాధుని దివ్య సందేశం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

సమాధి నుంచే భక్తులకు అభయం
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో ఫకీర్‌ అవతారంలోఅనేక మహిమలు ప్రదర్శించిన సాయినాధుడు ఇప్పటికీ సమాధి నుంచే భక్తులకు అభయమిస్తాడని అసంఖ్యాక సాయి భక్తుల నమ్మకం. సాయి మందిరాన్ని దర్శించుకునేందుకు రోజు వేలాది భక్తులు శిర్డీకి వస్తుంటారు.

శ్రద్ధ సబూరి
శ్రద్ధ అంటే విశ్వాసం. సబూరి అంటే ఓర్పు. సాయిబాబా తనను ఆశ్రయించిన భక్తులను ఎప్పుడూ రెండు పైసలు దక్షిణ అడిగేవారు. ఆ రెండు పైసలు శ్రద్ధ, సబూరి మాత్రమే. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు శ్రద్ధ, సబూరి. అలాగే భగవంతుని ఆశ్రయించి భక్తి మార్గంలో పయనించాలనుకునే వారికి కూడా ఉండాల్సిన రెండు లక్షణాలు భగవంతునిపై అచంచలమైన విశ్వాసం, భగవంతుని అనుగ్రహం లభించే వరకు ఓర్పుగా వేచి ఉండడం.

నిరాడంబరమే సాయితత్వం
శిర్డీ సాయిబాబా తన జీవితకాలంలో ఎలాంటి హంగులూ, ఆర్భాటాలూ చూపలేదు. మంత్రాలూ తంత్రాలూ ప్రదర్శించలేదు. నిరాడంబర జీవితం గడిపి చూపారు. సాయిబాబాకు మసీదే మహలు అయింది. అందరూ, అన్ని జీవులూ తినగా మిగిలిన పదార్ధాలనే పంచ భక్ష్య పరమాన్నాలుగా భావించి స్వీకరించేవారు.

జీవిత సత్యాలు బోధన
సాయి ఎంతో సాదా సీదాగా మసీదులో స్తంభాన్ని ఆనుకునో, నింబ వృక్షం కిందనో ఏ ఆడంబరాలూ లేకుండా కూర్చుని భక్తులకు జీవన సత్యాలు బోధిస్తూ ఉండేవారు. ఈ బోధలు భక్తుల పాలిట ఆణిముత్యాలు. ఈ సందర్భంగా సాయినాధుని బోధనల నుంచి కొన్ని ఆణిముత్యాలు తెలుసుకుందాం.

సాయి బోధల్లో ఆణిముత్యాలు

  • ఎవరిని అనవసరంగా నొప్పించకండి.
  • మీకు హాని తలపెట్టిన వారి పట్ల కూడా ప్రేమతో మెలగండి.
  • సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు.
  • ఇతరులు వేసిన నిందలు గురించి పట్టించుకోవద్దు. అవి అసత్య ఆరోపణలని తేలేవరకు సహనంతో ఉండండి.
  • దేవునిపట్ల విశ్వాసం ఉంచండి.
  • ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు.
  • తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు.
  • ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిదిద్దుకుంటూ సన్మార్గంలో ప్రయాణించాలి.
  • దేవుడివైపు మనం ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మనల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి.
  • చివరగా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు.

సాయినాధుడు అందించి ఈ ఆణిముత్యాలను నిత్య జీవితంలో ఆచరిస్తూ శ్రద్ధ సబూరితో జీవిస్తే భగవంతుని సులభంగా చేరుకోవచ్చు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై!

ముఖ్య గమనిక :పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ABOUT THE AUTHOR

...view details