YSRCP MLA Vasantha Venkata Krishna Prasad Comments on Jagan : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మైలవరం నియోజకవర్గం నుంచి భారీగా ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చర్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఏలూరులో వైసీపీ ఎన్నికల నగారా మోగించిన 'సిద్ధం' మహాసభకు సైతం వసంత గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపించగా ఇవాళ మైలవరం నియోజకవర్గపు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సభా వేదికగా వసంత ఏం చెబుతారు, ఆయన నిర్ణయం ఏమిటి ? రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో అనే ఆసక్తితో నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ ఐదేళ్లలో జరిగిన పరిణామాలను వెల్లడించారు.
అవసరమైతే రాజకీయాలు మానేస్తా.. కానీ ఆ పని చేయను..: వసంత కృష్ణ ప్రసాద్
కక్షసాధింపు చర్యలతో ఏమీ సాధించలేరు, అధికారం ఉందని అహంకారం ప్రదర్శించకూడదని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. చంద్రబాబును తిడితే పదవులు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించానన్న ఆయన, మనసు గాయపడ్డాక నిలువెత్తు బంగారం ఇస్తానన్నా వెనక్కి వెళ్లనని స్పష్టం చేశారు. రాజకీయాల నుంచి వెళ్లొద్దని తన అనుచరులు, అభిమానులు చెప్పారని, తన కుటుంబ సభ్యులు, అభిమానులతో మాట్లాడిన తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని వసంత వెల్లడించారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు.
నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే వసంత వరుస సమావేశాలు - నిర్ణయంపై ఉత్కంఠ !