YSRCP Corporators Issue in VMC : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరపాలక కౌన్సిల్‌ను అప్రజాస్వామిక పద్ధతిలో ఏకపక్షంగా నిర్వహించింది. ఇష్టానుసారం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. కొందరు ఆ పార్టీ కార్పొరేటర్లకు ఈ వ్యవహారం నచ్చకున్నా అన్నింటినీ మౌనంగా భరించారు. రాష్ట్రంలో అధికారం మారడంతో వీఎంసీ పాలకమండలిలోనూ కొంత మార్పు వచ్చింది.
నోరెత్తుతున్న సొంతపార్టీ కార్పొరేటర్లు : గతంలో విపక్షాలను కనీసం పట్టించుకోని పాలకపక్షం, ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం సూచనలు, సలహాలు తీసుకుంది. ప్రజలకు భారంగా మారిన చెత్తపన్నును రద్దు చేయడమేగాక, ఆస్తిపన్ను పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. గతంలో ఇవే సమస్యలపై విపక్షాలు గళమెత్తితే మార్షల్స్ సాయంతో బలవంతంగా బయటకు గెంటివేసింది. ఇన్నాళ్లు మౌనంగా వారి అరాచకాలను భరించిన సొంతపార్టీ కార్పొరేటర్లూ నోరెత్తుతున్నారు.
వైఎస్సార్సీపీ పనిపోయింది. ఆ పార్టీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కార్పొరేటర్లు పార్టీ మారాలని చూస్తున్నారు. మా మాటకు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు విలువ ఇస్తున్నారు. మా నిర్ణయాలను వారు పరిగణలోనికి తీసుకుంటున్నారు. గతంలో ఇలా ఉండేది కాదు. - బాలస్వామి, వీఎంసీ టీడీపీ పక్షనేత
YSRCP VMC Corporators Against Own party : మూడేళ్లుగా వీఎంసీలో అధికారపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ప్రజా సమస్యలపై దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. సీజనల్ వ్యాధులు, కలుషిత నీరు, డ్రైనేజీ సమస్య, దోమల బెడద ఉన్నా పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులనూ రాబట్టలేకపోయింది. నాడు ముఖ్యమంత్రిగా జగన్ విజయవాడ అభివృద్ధి కోసం ప్రకటించిన రూ.150 కోట్లనూ పాలకపక్షం పట్టుకురాలేకపోయింది. ఆ పార్టీ హయాంలోనే నగరంలో పెద్ద ఎత్తున ఆస్తుల ఆక్రమణలు చోటుచేసుకున్నా అరికట్టలేకపోయారు.