Bride harassed by morphing photos : పెళ్లి సంబంధం ఖాయమైన ఓ జంట ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆమె ఫోన్ ఎప్పుడు బిజీగా ఉన్నా, కాల్ ఎంగేజ్ వచ్చినా యువకుడు అనుమానించేవాడు. ఈ విషయాన్ని యువతి తమ ఇంట్లో చెప్పటంతో పెళ్లి రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కానీ, ఈ పరిణామాన్ని అవమానంగా భావించిన పెళ్లి కొడుకు వాట్సాప్ గ్రూపుల్లో ఆమె గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. అంతటితో ఆగకుండా విషప్రచారానికి దిగడంతో యువతి నవ్వుల పాలైంది. చివరికి బాధిత యువతి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తల్లిదండ్రులు అమెరికా సంబంధం చూశారు. మధ్యవర్తి ద్వారా ఓ యువకుడితో పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. పెళ్లికి ముందు వెడ్డింగ్‌షూట్‌లో అతడు అసభ్యకరంగా ప్రవర్తించటం యువతికి నచ్చలేదు. పైగా రెండ్రోజులు లాంగ్ రైడ్ వెళ్దామంటూ ఒత్తిడి తీసుకురావటంతో ఆమె భయపడిపోయింది. విషయం ఇంట్లో చెప్పగానే ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయని, జోడు కలవదంటూ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. పెళ్లి క్యాన్సిల్ కావడాన్ని మనసులో ఉంచుకొన్న అతడు వెడ్డింగ్ షూట్లో తీసుకున్న ఫొటోలను మార్ఫింగ్ చేసి పోర్న్‌సైట్‌లో పెట్టేశాడు.
ఈ రెండు ఉదంతాలే కాదు.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ తరహా ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి ఫొటో మార్ఫింగ్ కేసులు ఇటీవల నగరంలోని పలు స్టేషన్లలో నమోదయ్యాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నాయి. అమ్మాయి తరపు కుటుంబం వివిధ కారణాలతో పెళ్లిని తిరస్కరిస్తే కొందరు ప్రబుద్ధులు జీర్ణించుకోలేక దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడుతూ క్షమించరాని నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయి వైపు తప్పు లేకున్నా నిత్యం నరకం చూపుతూ వేధిస్తున్నారు. యువతీ యువకుల అభిరుచులకు ప్రాధాన్యం ఇవ్వకుండానే, ఒకరి గురించి మరొకరు ఓ అభిప్రాయానికి రాకముందే, మూడుముళ్లు పడకుండానే ఫోన్‌నెంబర్లు మార్చుకుంటున్నారు. ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటారనే అభిప్రాయంతో తల్లిదండ్రులు ఏర్పాటు చేస్తున్న ప్రీ వెడ్డింగ్‌షూట్‌లు అసలు విషయాన్ని పక్కన పెట్టేలా సాగుతున్నాయి. పెళ్లిపీటలు ఎక్కేవరకూ సరైన జోడు కాదని ఆడపిల్లలు భావిస్తే తల్లిదండ్రులు సంబంధాన్ని నిరాకరిస్తున్నారు.
ఇది సరికాదు...
ఇలా పెళ్లి చూపులు పూర్తవగానే అలా అన్ని వివరాలు ఇచ్చిపుచ్చుకోవాల్సిన అవసరం లేదని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయి తరఫు కుటుంబీకులు వ్యక్తిగత వివరాలు, కుటుంబ విషయాలు, ఫోన్ నంబర్లు ఇవ్వొదని చెప్తున్నారు. తల్లిదండ్రుల ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దని, పెళ్లిముసుగులో కొందరు ప్రబుద్ధులు ప్రదర్శించే వికృతాలను గుర్తించినప్పుడు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని భరోసా ఇస్తున్నారు.
ప్రేయసిపై బ్లేడ్‌తో దాడి చేసిన ప్రియుడు- ప్రేమ పేరుతో వేధింపులు!