Peddapuli In Andhra Pradesh : ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం వెలగలపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజుల క్రితం మేత కోసం వెళ్లిన ఆవుపై పెద్దపులి దాడిచేసి చంపింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు 80,000/- రూపాయలు ఉంటుందని యజమాని తెలిపారు. పెద్దపులి కదలికలను కనిపెట్టేందుకు అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.
చిరుత దాడిలో ఆవుదూడ మృతి: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లిలో చిరుత దాడిలో ఆవుదూడ మృతి చెందింది. మృతిచెందిన ఆవుదూడ విలువ సుమారు 30,000/- రూపాయల వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. చిరుత సంచారంపై అటవీశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్తున్నామని రైతులు తెలిపారు.
నెల్లూరు జిల్లాలో సైతం: నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచారం గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తోంది. పెంచలకోన అటవీ శాఖ పార్క్‌సమీపంలో రాత్రి చిరుత కనిపించింది. ద్విచక్రవాహనంపై వెళ్లేవారికి చిరుత కనిపించగా వారు భయంతో ఒక్కసారిగా కేకలు వేశారు. అప్పుడు చిరుత భయపడి అడవిలోకి పరారైంది. బైకుపై అటు వైపుగా వెళ్తున్న వ్యక్తులు దాన్ని ఫోన్లో వీడియోలు తీశారు.
"పత్తిచేనులో పెద్దపులి" - తాళ్లు తెంపుకుని ఊళ్లోకి పరిగెత్తిన ఎద్దులు