Cyclone Fengal Alert : నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం స్థిరంగా కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతానికి ట్రింకోమలీకి తూర్పు-ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, నాగపట్నానికి ఆగ్నేయంగా 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. శుక్రవారం ఉదయానికి శ్రీలంక తీరాన్ని దాటి తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
శనివారం (నవంబర్ 30వ తేదీ) ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల వెంట కారైకాల్-మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది.
Heavy Rain Alert in AP : తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.