ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

అడుగుపెడుతూనే అక్రమార్జనలో వైసీపీ కీలక నేత లీనం - 'ఎన్నికల ఫండ్‌' పేరుతో వసూళ్లు

YSRCP Leaders Threatening Realtors: ఆయన రాజధాని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి. దూకుడుతో పాటు దూషణలకు ఆయన పెట్టింది పేరు. మార్పుల్లో భాగంగా ఆయన్ని అధిష్ఠానం మరోచోటికి మార్చింది. అంతే వసూళ్లు ప్రారంభించారు. విద్యాసంస్థలు, రియల్టర్లను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారు. ఇసుక, గ్రావెల్‌ తవ్వకాలతో కోట్లు ఆర్జిస్తున్నారు. ఇది చూసిన స్థానికులు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తు పరిస్థితి ఏంటోనంటూ ఆందోళన చెందుతున్నారు.

YSRCP Leaders Threatening Realtors
YSRCP Leaders Threatening Realtors

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 23, 2024, 9:39 AM IST

అడుగుపెడుతూనే అక్రమార్జనలో వైసీపీ కీలక నేత లీనం - 'ఎన్నికల ఫండ్‌' పేరుతో వసూళ్లు

YSRCP Leaders Threatening Realtors : రాజధాని ప్రాంతానికి చెందిన ఓ ప్రజాప్రతినిధికి టికెట్ల సర్దుబాటులో భాగంగా అధికార పార్టీ అధిష్ఠానం ఇటీవల నియోజకవర్గాన్ని మార్చింది. దూకుడు, దుందుడుకు స్వభాగం గల ఆ నేత కొత్త ప్రదేశానికి వచ్చీ రాగానే దుకాణం తెరిచారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు నెలవు. ప్రముఖ విద్యాసంస్థలకు నిలయం. నది వెంబడి ఇసుక రేవులూ ఎక్కువే. వీటన్నింటినీ ఆదాయ వనరులుగా మార్చుకున్న ఆ నేత అనుచరులతో కోట్లలో వసూలు చేయిస్తున్నారు. 'ఎన్నికల ఫండ్‌ (Election Fund)' పేరుతో జోలె పట్టి అక్రమార్జనలో జోగుతున్నారు. తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జలవనరుల శాఖ ఇంజినీర్లకు లక్ష్యాలు విధిస్తూ వారి ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు.

నాయకుడు అంతకుముందు స్వస్థలంలో ఓడిపోతే గత ఎన్నికల్లో మరో నియోజకవర్గానికి పంపించారు. అక్కడ గెలిచినప్పటికీ అక్రమార్జనకు పెద్దగా అవకాశాల్లేకుండా పోయాయి. దీంతో పాత నియోజకవర్గంలోని వనరులపై కన్నేశారు. ఇసుక, బూడిద రవాణాకు సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఉచితంగా దొరికే బూడిదను ఎత్తి కోట్లు కొల్లగొడుతున్న వైనంపై అధినేతకు ఫిర్యాదులు వెళ్లాయి. కానీ ఆ దూకుడు నేతను ఏమీ అనకపోవడంతో అతని దందాకు లైసెన్స్‌ ఇచ్చినట్లైంది. అదే క్రమంలో అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యర్థి పార్టీపైకి కర్రలు చేతబూని మరీ దాడికి వెళ్లారు. ఈ ఘటన తర్వాత అధినేత మరింత పెద్ద పదవితో వీరతిలకం దిద్దారు. ఇక అంతే, అతని ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.

ప్రజా ధనాన్ని సీఎం జగన్​ లూటీ చేస్తున్నారు: నారా లోకేశ్​

ఈ నేత కొత్త నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించిన వెంటనే అతనిలోని అసలు అక్రమార్జనుడు నిద్ర లేచాడు. అంతకుముందు అక్కడి ప్రజాప్రతినిధి దగ్గర ఉన్న 'రాంబంటు' అతన్ని వదిలి ఈ నేత పంచన చేరారు. ఈ వ్యక్తి గతంలో రాముని పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టడంతో ఆ నేత పక్కన పెట్టారు. ఇప్పుడీ కొత్త నాయకుడి వద్ద విధేయుడిగా చేరిన రాంబంటు స్థిరాస్తి వ్యాపారుల వద్ద ఎన్నికల ఖర్చు పేరుతో జోలె పట్టారు. ఓ ప్రముఖ సంస్థ పంచాయతీ అనుమతులు లేకుండానే 40 ఎకరాల్లో భారీ వెంచర్‌ వేసింది. పక్కనున్న రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు ఓ సంస్థకు 10 లక్షల చెక్‌ అందించింది. ఇది తెలిసిన గ్రామస్థులు రోడ్డు ధ్వంసమైందని, కోటి ఇవ్వాల్సిందేనని భీష్మించారు. వెంచర్‌లో పనులను అడ్డుకొని వాహనాలు రాకుండా రోడ్డును తవ్వేశారు. కొత్త ప్రజాప్రతినిధి రంగంలో దిగి, వ్యవహారం చక్కబెట్టారు. రియల్టర్ల నుంచి ఎకరానికి లక్ష చొప్పున 40 లక్షల గుడ్‌విల్‌ అందుకున్నారు. గ్రామస్థుల నోటికి తాళం వేయించారు.

జోగి రమేష్ ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు పట్టించుకోవట్లేదు : బోడె ప్రసాద్‌

ఈ నియోజకవర్గంలో విద్యా సంస్థలు ఎక్కువ. రెండు ప్రముఖ సంస్థల బ్రాంచీలు అనేకం ఉన్నాయి. ఈ నాయకుడికి ఎన్నికల విరాళం ఇవ్వాలంటూ అనుచరుడు రాంబంటు ద్వారా ఆ కాలేజీలకు సందేశం పంపించారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమాంతం పడిపోయిన స్థిరాస్తి వ్యాపారం టీడీపీ - జనసేన పొత్తు ప్రభావంతో ఇటీవల పుంజుకుంటోంది. కొత్తగా వెంచర్లు వేస్తున్న వారిపై కన్నేసిన వసూలురాజా అనధికార లేఔట్లు, నిర్మాణాలను టార్గెట్‌గా చేసుకొన్నారు. ఎకరానికి 50 వేల నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.రాంబంటుకు గతంలో ఉన్న అనుభవంతో వెంచర్ల యజమానులకు హెచ్చరికలు పంపుతున్నారు. మూణ్నాలుగు వారాలుగా ఈ ప్రాంతంలో రియల్టర్లు హడలిపోతున్నారు. వసూలురాజా నివాసం సమీపంలోనే ఉన్నా ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని అడ్డాగా మార్చుకున్నారు.

తన నియోజకవర్గం కాకపోయినా జగనన్న కాలనీల పేరుతో కలెక్టర్ల నుంచి గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతి తీసుకుని అనుచరులతో ఇష్టానుసారం మట్టి తవ్విస్తున్నారు. కొండలను కరిగించేస్తున్నారు. ఇసుక రేవుల్లో కొత్తగా టెండర్‌ దక్కించుకున్న సంస్థను కాదని, తవ్వకాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. రీచ్‌ల నుంచి హైదరాబాద్‌కు ఇసుక తరలించి రోజుకు 50 లక్షల చొప్పున 20 రోజులుగా 10 కోట్ల వరకు కొల్లగొట్టారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ నాయకుడి అనుచరులు నియోజకవర్గంలోని ఓ మున్సిపల్‌ కమిషనర్‌ను 'సార్‌ పర్యటనలకు ఖర్చులు భరించాలి. మీ వాటా రూ.లక్ష!' అంటూ రేట్‌ ఫిక్స్‌ చేశాడు. ఆ అధికారి కిమ్మనకుండా సమర్పించుకున్నారు. తహసీల్దారు, ఎంపీడీవోలు, ఇంజినీర్లకు కూడా టార్గెట్లు పెడుతున్నారు. మహిళలతో సమావేశాలు నిర్వహిస్తూ చికెన్‌తో భోజనాలు పెట్టిస్తూ, బిల్లులు మాత్రం డ్వాక్రా గ్రూపులకు పంపుతున్నారు.

బూడిద అక్రమ రవాణా చేస్తూ మంత్రి జోగి రమేష్‌, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కోట్లు కొల్లగొడుతున్నారు - దేవినేని ఉమ

ABOUT THE AUTHOR

...view details