ఎన్నికల అక్రమాలకు అడ్డాగా మారిన తిరుపతి- ముగ్గురు వైసీపీ జగజ్జంత్రీలదే హవా YSRCP Leaders Irregularities in Tirupati: తిరుపతి జిల్లాలో ఏ అధికారైనా పోస్టింగు పొందాలంటే వారు వైసీపీకి, అంతకు మించి అధికార పార్టీకి చెందిన ముగ్గురు జగజ్జంత్రీలకు వీర విధేయులై ఉండాల్సిందే. బాధ్యతలు చేపట్టిన వెంటనే వారి ఇళ్లకు వెళ్లి దర్శించుకోవాలి. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, దుశ్శాలువాలతో సత్కరించుకోవాలి. వారి అక్రమాలకు సహకరిస్తూ అవసరమైతే బలైయ్యేందుకు సిద్ధంగా ఉండాలి.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల(Tirupati Lok Sabha By-Elections) వేళ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారిగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి గిరీషా(IAS Officer Girisha) నుంచి ఆయన అధికారిక ఈఆర్‌వో లాగిన్, పాస్‌వర్డ్‌లు లాగేసుకున్నారు. వాటి ద్వారా అబ్సెంటీ ఓటర్లకు సంబంధించిన 30 వేలకు పైగా ఎపిక్ కార్డులు డౌన్‌లోడ్ చేసి, భారీఎత్తున దొంగ ఓట్లు వేయించారు.
తిరుపతిలో అక్రమాలపై 'ఆమె' దృష్టి- 20రోజుల్లోనే ఎస్పీ బదిలీ
ఈ వ్యవహారంలో గిరీషా సస్పెండ్(IAS Girisha Suspended) అయ్యారు. మరికొందరు రెవెన్యూ, పోలీసు అధికారులూ సస్పెన్షన్‌కు గురయ్యారు. సూత్రధారులైన ఆ ముగ్గురు నేతలు మాత్రం దర్జాగా ఉన్నారు. అధికారుల జీవితాలు ఏమైపోయినా వారికి అనవసరం. తలూపుతూ అక్రమాలకు సహకరిస్తే చాలు. పని అయ్యాక కరివేపాకులా పక్కన పడేస్తారు.
ఐఏఎస్ అధికారి లక్ష్మీశ(IAS Officer Lakshmisha) గత నెలలో తిరుపతి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. శాలువ కప్పి, పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సదరు ప్రజాప్రతినిధి కుమారుడే పోటీ చేయనున్నారు.
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో అక్రమాలు, నకిలీ ఓటరు గుర్తింపు కార్డుల తయారీ, వాటితో దొంగ ఓట్లు వేయించిన వ్యవహారంలో ఈ ప్రజాప్రతినిధి, ఆయన కుమారుడి పాత్ర ఉన్నట్టు ఫిర్యాదులున్నాయి. అయినప్పటికీ లక్ష్మీశ తానే స్వయంగా ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి మరీ కలిశారు. ఏదైనా జిల్లాకు కొత్త కలెక్టర్ వస్తే ఎమ్మెల్యేలే వెళ్లి వారిని కలుస్తుంటారు. ఎమ్మెల్యేల ఇంటికి జిల్లా కలెక్టర్లు వెళ్లి కలవటం సంప్రదాయాలకు విరుద్ధం.
తిరుపతిలో యథేచ్ఛగా వైసీపీ భూదందాలు - ప్రశ్నిస్తే దాడులు
అలాంటిది సార్వత్రిక ఎన్నికల వేళ జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతల్లో ఉన్న లక్ష్మీశ ఈ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి కలిసొచ్చారు. కాబట్టే ఆయన ఆ పోస్టులో ఇంకా కొనసాగుతున్నారు. అదే జిల్లా ఎస్పీగా నియమితురాలైన మలికా గార్గ్ విధుల్లో చేరాక, ఏ నాయకుడ్నీ కలవలేదు అందుకే బాధ్యతలు చేపట్టిన 20 రోజుల్లోనే ఆమెను సాగనంపేశారు.
మలికా గార్గ్ కన్నా ముందు తిరుపతి ఎస్పీగా పీ.పరమేశ్వర్‌రెడ్డి దాదాపు రెండేళ్ల పాటు పనిచేశారు. వైసీపీకి అనుకూలంగా, వారి అరాచకాలకు కొమ్ముకాసి, ప్రతిపక్షాలను అణచివేసే అధికారిగా గుర్తింపు పొందిన ఆయన "జగజ్జంత్రీలు" చెప్పిందల్లా చేసి మితిమీరిన స్వామిభక్తి చాటుకున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆయనకు ప్రకాశం జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. జగజ్జంత్రీల్లో ఒకరైన చంద్రగిరి నియోజకవర్గ నేత రాబోయే ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో తిరుపతిలో తమకు వీర విధేయుడిగా ఉంటూ, అన్ని విధాలా కొమ్ముకాసిన పరమేశ్వర్‌రెడ్డిని ప్రకాశం ఎస్పీగా నియమింపజేసుకున్నారు. గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. నిరక్షరాస్యులూ పట్టభద్రులమంటూ దొంగ ఓట్లు వేశారు. ఆ సమయంలో పరమేశ్వర్‌రెడ్డే ఎస్పీగా ఉన్నా, వాటిని నిలువరించలేదు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్ల తొలగింపు కోసం నకిలీ ఫాం-7 దరఖాస్తు చేసిన వారిపై ఎన్నికల సంఘం(Election Commission) ఆదేశాల మేరకు 10 కేసులు నమోదయ్యాయి.
తప్పులు సరిదిద్దుకోకుండా రమణ దీక్షితులుపై వేటు దారుణం: నారా లోకేశ్
ఆయా కేసుల్లో నిందితులందరూ వైసీపీ వారే. కానీ వారిలో ఒక్కరంటే ఒక్కర్నీ ఆయన అరెస్టు చేయలేదు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల అక్రమాలపై నమోదైన కేసుల్నీ నీరుగార్చేశారు. ఇలా అడుగడుగునా అక్రమాలకు కొమ్ముకాసిన పరమేశ్వర్‌రెడ్డికి కీలక పోస్టు కట్టబెట్టారు. ఆయనకన్నా ముందు ఎస్పీగా పనిచేసిన చింతం వెంకటప్పలనాయుడు వారు చెప్పినట్లుగా నడుచుకోవట్లేదంటూ అక్కడి నుంచి కొన్ని నెలల్లోనే సాగనంపేశారు.
రాష్ట్రంలో తీవ్రస్థాయి ఎన్నికల అక్రమాలకు తిరుపతి కేంద్రబిందువుగా మారింది. అధికార పార్టీ "జగజ్జంత్రీలు" దీన్ని ఎన్నికల అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, టౌన్‌బ్యాంక్ ఎన్నికలు ఇలా ప్రతి సందర్భంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఇంతటి తీవ్ర సమస్యాత్మక ప్రాంతంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా, అక్రమాలకు ఆస్కారం లేకుండా జరగాలంటే నిక్కచ్చిగా, నిజాయతీగా, సమర్థంగా పనిచేసే అధికారులను నియమించాలి.
కానీ ముగ్గురు నేతలు చెప్పినట్లుగానే ఇప్పటికీ పోస్టింగులు, బదిలీలు జరుగుతున్నాయి. వారికి వీర విధేయులుగా పనిచేసే అధికారులను తెచ్చిపెట్టుకుంటూ, మాట వినరనుకునేవారిని పంపించేస్తున్నారు. ఇలా అయితే నిష్పక్షపాత ఎన్నికలు ఎలా సాధ్యమవుతాయి? ఎన్నికల సంఘం వీటిపై ఎందుకు దృష్టిసారించడం లేదు? ఈ ముగ్గురు నేతలను ఎందుకు కట్టడి చేయట్లేదు? ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలకు అస్కారమివ్వటం కాదా అనే ప్రశ్నలు ప్రజాస్వామ్యవాదుల నుంచి వినిపిస్తున్నాయి.