MALLAVALLI INDUSTRIL PARK ISSUE: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడ అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పారిశ్రామిక వాడలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
భూసేకరణకు 1,467 ఎకరాల భూమి: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో (2014 -2019 మధ్యలో) కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో పారిశ్రామికవాడ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అందుకుగాను మల్లవల్లిలో పారిశ్రామికవాడ నిర్మాణం కోసం అప్పట్లోనే 1,467 ఎకరాల భూమిని ఏపీఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) అధికారులు సేకరించారు. అయితే ఇందులో 100 ఎకరాలను మెగా ఫుడ్ పార్కుకు కేటాయించగా, 57.45 ఎకరాల విస్తీర్ణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రాజెక్టులను నిర్మించేందుకు వీలుగా లే అవుట్ వేసి 13.20 కోట్లతో మౌలిక వసతులకు సంబంధించిన పనులు చేపట్టారు.
సాంకేతిక కారణాలతో అందని పరిహారం: సుమారు 200 కోట్ల రుపాయల వ్యయంతో ఇక్కడ ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా అధికారులు అప్పట్లోనే కార్యాచరణను రుపొందించారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలుగుదేశం ప్రభుత్వం ఎకరం భూమిని 2016లో 16.50 లక్షల చొప్పున కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి భూమి విలువ తక్కువగా ఉండటంతో సహా మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తుండంతో పరిశ్రమల స్థాపనకు మొదట్లో పలు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపాయి.
అయితే మొత్తం 490 మంది రైతుల నుంచి 716.44 ఎకరాలను గుర్తించి ఎకరా పొలాన్ని రూ. 7.50 లక్షల చొప్పున రూ. 53.73 కోట్లు పరిహారం చెల్లించేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా 615.6 ఎకరాలకు గాను 443 మంది రైతులకు రూ. 46.17 కోట్లను అధికారులు అప్పుడే చెల్లించారు. సాంకేతిక సమస్య, భూ రికార్డుల్లో వివరాలు సరిగా లేకపోవడం, ఆధార్ వంటివి లేకపోవడంతో సుమారు 128 మంది రైతులకు పరిహారం అందలేదు.
ప్రభుత్వం మారి.. కష్టాలు రెట్టింపు.. పరిహారం కోసం రైతుల పడిగాపులు
జగన్ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కానీ 2019 తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో మల్లవల్లిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పరిశ్రమ ఏర్పాటు కోసం భూమి కేటాయింపులను అమాతం పెంచడం, అధికారులు, వైఎస్సార్సీపీ నేతల వేధింపులతో పారిశ్రామిక వేత్తలు మల్లవల్లి వైపే చూడలేదు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పారిశ్రామిక వేత్తలు మల్లవల్లి నుంచి వెళ్లిపోయారు. జగన్ పాలనాకాలంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి.
గందరగోళ పరిస్థితులు: అయితే మళ్లీ 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మల్లవల్లిలో పారిశ్రామిక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. మల్లవల్లిలో నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించకుండా ఉన్న పారిశ్రామికవేత్తలు ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం కోరుతోంది. అలాగే మల్లవల్లిలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్న నేపథ్యంలో అధికారులు మల్లవల్లిలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. దీంతో నష్ట పరిహారం లభించని రైతులు వారి భూముల్లోకి అధికారులు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
మల్లవల్లిలో 144 సెక్షన్: ఈ ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేందుకు సుమారు 17 మందికి పైగా రైతులను పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. మల్లవల్లి ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మల్లవల్లి గ్రామంలో 144 సెక్షన్‌ను విధించారు. పారిశ్రామికవాడకు వెళ్లే ప్రధాన రహదారితో పాటు మల్లవల్లి, గొల్లపల్లి గ్రామాలకు వెళ్లే రహదారులను బ్యారికేడ్లతో మూసివేశారు. రెవెన్యూ పోలీసు అధికారులను తప్ప ఇతరులను లోపలికి అనుమతించలేదు. దీని కారణంగా పరిశ్రమలకు వెళ్లే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీల ప్రతినిధులను గుర్తింపు కార్డులను చూసి మాత్రమే అనుమతిస్తున్నారు.
అభివృద్ధిని అడ్డుకోం- పరిహారం చెల్లించండి: భూ వివాదానికి కారణం రెవెన్యూ అధికారులేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడబోమని, నష్టపరిహారం అందజేస్తే చాలని వారు గగ్గోలు పెడుతున్నారు. తమకు న్యాయం చేయాలని గతంలో పారిశ్రామికవాడకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి, యువగళం పాదయాత్రలో తమ ప్రాంతానికి వచ్చిన మంత్రి నారా లోకేశ్‌కి విన్నవించామన్నారు. అధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరించి నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తుకుంటున్నారు. అభివృద్ధికి రైతులు అడ్డుపడరని, తమపై బలవంతపు అరెస్టులు, గృహ నిర్బంధాలు ఎందుకని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తమ ప్రాంతం అభివృద్ది చెందితే తమకే సంతోషంగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రైతులు సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం ముందుకు వెళ్లితే బాగుంటుందని సూచిస్తున్నారు. రైతులను ఇబ్బందులు పెడుతూ పనులు చేయడం మంచిది కాదని తెలిపారు. మరి కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
రాగానిపల్లి భూములపై భారీ కుట్ర - 982 ఎకరాల కొట్టేసి ప్రభుత్వానికే విక్రయించేందుకు ప్లాన్ - YSRCP Leaders Land Grabbing