YSRCP Leaders Assigned Lands Grabbed :రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఇచ్చిన నివేదిక ప్రకారం గత 6 నెలల్లోనే 39 వేల 398 ఎకరాల 7 సెంట్ల ఎసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైఎస్సార్సీపీ సర్కారు నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు, సీనియర్ అధికారులు ముందస్తు ఒప్పందాలు చేసుకొని భూములను చౌక ధరకు కొనుగోలు చేశారు.
అలాగే యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం నిషిద్ధ జాబితా 22(A) నుంచి 9 లక్షల 975 ఎకరాల 23 సెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. ఇందులో 39 వేల 397 ఎకరాల ఎసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో అంటగాగిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాలను అందజేశారు. ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చింది ఆయనే. ఎసైన్డ్ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేయడంపై ఇటీవల వరకూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్‌రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా త్వరలో ఈ అక్రమాలను బహిర్గతం చేసి ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖలో అసైన్డ్ భూములపై సీఎస్ కన్ను - రూ.2 కోట్లు పలికే భూములు ఐదారు లక్షలకే: మూర్తియాదవ్ - Murthy Yadav Allegations on CS
2023 జులై 31 కంటే 20 ఏళ్ల ముందు ఎసైన్ చేసిన భూముల్ని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న వైఎస్సార్సీపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు 2023 డిసెంబర్‌లో విడుదలయ్యాయి. ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో మూడు మెమోలు కూడా జారీ చేశారు. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వివరాలను కూడా పరిశీలించకుండా కలెక్టర్లు జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేయాలని నిషిద్ధ జాబితా నుంచి తప్పించాలని మెమోల్లో ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు.
ప్రభుత్వ భూమిపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు - కబ్జా చేసేందుకు యత్నం
నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో 25 వేల ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖలో 861, విజయనగరం జిల్లాలో 109 ఎకరాలు చేతులు మారాయి. యాజమాన్య హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ గత కొన్ని దశాబ్దాల నుంచి అధీనంలో ఉన్న భూములు అమ్ముకునేవారు. తక్కువగానే ఉంటారు. ఈ పరిస్థితుల్లో 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 39 వేల 398 ఎకరాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని చేతులు మారాయి. ఇంకా మరికొన్ని ఒప్పందాలు జరిగి రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నవారూ ఉన్నారు. అక్రమాలకు దోహదం చేస్తోన్న జీవో 596 అమలును తాత్కాలికంగా నిలిపివేసి వాస్తవాలపై స్పష్టత వచ్చాక మార్పులు, చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్నదానిపై ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది.
భూమిని ఆక్రమించిన వైసీపీ శ్రేణులు - సీఎం జగన్ చేతుల మీదుగా అధికారికంగా పంపిణీ