YSRCP Smart Meters Scam:రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చేందుకు ఎన్టీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు సామగ్రి కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్ చేయించాలని భావిస్తోంది. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 18 లక్షల 58వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, అనుబంధ పరికరాల కోసం 5వేల 692 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను జగన్ అస్మదీయ కంపెనీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టింది.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకు బిల్లుల చెల్లించి భారీ లబ్ధి చేకూర్చినట్లు ఎన్టీయే ప్రభుత్వానికి సమాచారం అందింది. అనుబంధ పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్స్‌కు రూ.1,828 కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కంలు చెల్లించినట్లు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్మార్ట్ మీటర్లు, అనుబంధ పరికరాల కోసం 2022-23లో డిస్కంలు రెండోసారి టెండరు ప్రకటన ఇచ్చాయి.
SMART METERS : మీటర్లూ అయిన వాళ్లకే.. ప్రశ్నిస్తే దాడులు.. గిట్టని వాళ్లని పనులంటూ దోపిడీ
ఇందులో గుత్తేదారు సంస్థకు అనుకూలంగా నిబంధనలను రూపొందించిందన్న ఆరోపణలు ఉన్నాయి. బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు 80 శాతాన్ని 14 రోజుల్లో చెల్లించేలా నిబంధన చేర్చాయి. ఆ పరికరాల సరఫరాను 14 రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థాయి అధికారి ధ్రువీకరించాలని, ఒకవేళ ఆలస్యమైతే గుత్తేదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని బిల్లు మొత్తాన్ని చెల్లించాలని ఒప్పందంలో తెలిపాయి.