YSRCP Leaders Join In To TDP :సార్వత్రిక ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కుతున్నారు. వైఎస్సార్సీపీలో సరైన ప్రధాన్యత లేకపోవడంతోనే టీడీపీలోకి చేరామన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని నేతలు భరోసా ఇచ్చారు.
ముమ్మిడివరం నియోజకవర్గం :కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని 500మత్స్యకార కుటంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. టీడీపీ అభ్యర్థి దాట్ల బుజ్జిబాబు, జనసేనికులు మత్స్యకారులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లోని మత్స్యకారులు టీడీపీ అభ్యర్థి దాట్ల బుజ్జిబాబుకు మద్దతు తెలియజేశారు. తమ ప్రభుత్వం రాగానే జిల్లాలోని మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బుచ్చిబాబు హామీ ఇచ్చారు.
భీమునిపట్నం :విశాఖ జిల్లా భీమునిపట్నంలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జెడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో విధివిధానాలు నచ్చకపోవడంతోనే పార్టీని వీడామని వెంకటప్ప తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. త్వరలో భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని వెంకటప్ప తెలిపారు.
ఒంగోలు :ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన సుమారు 350 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఒంగోలులోని నగరంలోని 32వ డివిజన్ వరకు ర్యాలీతో వైసీపీ నుంచి 150 కుటుంబాలు టీడీపీ చేశారు. 48 డివిజన్ లో వైకాపా లో ఉన్న 200 మంది కార్యకర్తలు, నాయకులు టీడీపీలోకి జనార్ధన్ ఆధ్వర్యంలో చేరారు. వారికి ఆ పార్టీ నేత దామచర్ల జనార్ధన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో సరైన ప్రధాన్యత లేకపోవడంతోనే టీడీపీలోకి చేరామన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తానని దామచర్ల జనార్ధన్ చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే తమ దగ్గరకు వస్తే వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామని జనార్ధన్ భరోసా ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి, తనను గెలిపించాలని ఆయన సూచించారు.