YS Sunitha Met AP CM Chandrababu Naidu: వివేకా కుమార్తె డాక్టర్ సునీత దంపతులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తో పాటు తమపై పెట్టిన అక్రమ కేసు గురించి సీఎంకు చెప్పారు. సునీత ఫిర్యాదుపై స్పందించిన సీఎం - కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజానిజాలు, సీబీఐ ఎస్పీ రాంసింగ్ పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసని తప్పనిసరిగా విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలను బయటకు తేవాలని వైఎస్ సునీత కోరారు. సీఎం సానుకూలంగా స్పందించారు.
గతంలో ఆగస్టు 7వ తేదీన హోం మంత్రి వంగలపూడి అనితతో సైతం వైఎస్ సునీత భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసులో (Viveka Murder Case) జరిగిన అన్యాయంపై అనితకు సునీత వివరించారు. వివేకా హత్య అనంతరం జరిగిన పరిణామాలను హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారనీ, వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారు.
కేసు విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు సాక్షుల్ని బెదిరించి, పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారని సునీత తెలిపారు. సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని ఆ సమయంలో అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని అన్నారు.