YS Sharmila Counter to YS Jagan: అసెంబ్లీకి వెళ్లని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలరెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా పదవులకు రాజీనామా చేయాలన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ధ్వజమెత్తారు.
ఇంతకుముంచిన పిరికితనం, చేతగానితనం, అహంకారం ఎక్కడ కనపడవు, వినపడవని విమర్శించారు. మోసం చేయడం జగన్‌కు కొత్తేమీ కాదని, కానీ ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఇంత దారుణంగా మోసం చేయడం, అవమానించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళాకోరుతనంగా అభివర్ణించారు.
MLA అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక కావడానికా లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా అని ప్రశ్నించారు. నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే, తాపీగా ప్యాలస్‌లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకోలేదని ట్వీట్ చేశారు.
ఐదేళ్ల అవినీతి, దోపిడీ పాలనతో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి అప్పులకుప్పగా మార్చేశారని ప్రభుత్వం చెబుతుంటే, ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్‌లో ప్రశ్నించే బాధ్యత లేదా అని షర్మిల ప్రశ్నలు సంధించారు.
అసెంబ్లీకి వెళ్లనని చెప్పే నాయకుడు ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదన్నారు. బడికి వెళ్లని పిల్లవాడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారని, ఆఫీసుకు పోననే పనిదొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారని, ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోనంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు, ఆఫ్రికా అడవులకు పోతారో, అంటార్కిటికా మంచులోకి పోతారో ఎవరికి కావాలన్నారు. అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని షర్మిల రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్‌నే అంటారా? - వైఎస్ జగన్‌పై షర్మిల ప్రశ్నల వర్షం - Sharmila Counter to YS Jagan
ఏది విత్తుతారో అదే కోస్తారు- బాబాయ్ హత్యపై జగన్ ఎందుకు ధర్నా చేయలేదు?: షర్మిలా - sharmila fire on jagan