YS Sharmila Contest from Kadapa :తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకనే తాను కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద తల్లి విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డితో కలిసి వైఎస్ షర్మిల నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలు తండ్రి సమాధి వద్ద ఉంచి షర్మిల ఆశీర్వాదం తీసుకున్నారు.
వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారు :తన అనుకున్న వాళ్లను జగనన్న నాశనం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహించారని విమర్శించారు. చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్(AP CM Jagan) కడప ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని, వివేకాను చంపించిన అవినాష్‌కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నట్లు తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నా వివేకా హంతకులు నేటికీ తప్పించుకొని తిరుగుతున్నారని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది : 'ఎన్నికల ముందు నువ్వు నా చెల్లివి కాదు, నా బిడ్డ అని జగన్ అన్నారు, ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారు' అని వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ సీఎం జగన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని ఎద్దేవా చేశారు. జగన్ అంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. దారుణంగా చిన్నాన వివేకాను చంపితే, గుండెపోటుతో చనిపోయారని సాక్షి టీవీలో మెుదట చూపించారని పేర్కొన్నారు. ప్రజలు హర్షించరని తెలిసి కూడా అవినాష్‌కే, సీఎం జగన్ టికెట్ ఇచ్చారని తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేయాలనేది చిన్నాన్న చివరి కోరిక అని, వివేకా కోరికను నెరవేర్చడానికే కడప ఎంపీగా బరిలో దిగుతున్నట్లు పేర్కొన్నారు.