Sharmila Comments on MLA Jagan :పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (MLA Jagan Mohan Reddy) సహా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) మరోసారి తప్పుబట్టారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం జగన్‌కు లేదా అని ప్రశ్నించిన షర్మిల అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మైకు ఇవ్వరని చెబుతూ మారాం చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే శాసనసభకు వెళ్లకుండా జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వెళ్లాలని కాంగ్రెస్ తరఫున లేఖ రాసినట్లు తెలిపారు. విజయవాడలో మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడారు.
జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయంకృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 151 స్థానాల్లో గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను గమనించి ప్రజలు 11 సీట్లే ఇచ్చారని స్పష్టం చేశారు. ఆ కృతజ్ఞతైనా ఉండాలి కదా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ మీద అలగడానికి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించలేదు : షర్మిల
ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారు :జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతోందని వైఎస్ షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేవా? దీనికి ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలనూ ఇవే ప్రశ్నలు అడుతున్నామని అన్నారు. సభకు వెళ్లకపోవడమంటే ప్రజలకు వెన్నుపోటు పొడవడం కాదా? అని ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెడితే వైఎస్సార్సీపీ సభ్యులు కనీసం హాజరు కాలేదని గుర్తు చేశారు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె అన్నారు.