Union Minister Pemmasani on Funds Allocated to AP in Union Budget:పదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి దాదాపు 80 వేల కోట్ల రూపాయలు నిధులు రానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2024-25 బడ్జెట్లో రాష్ట్రానికి ఎవరు ఊహించని రీతిలో 15,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించారని పెమ్మసాని తెలిపారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుందని, అందులో భాగంగా 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాజధాని అమరావతి ఔటర్ రింగురోడ్డు నిర్మాణంకు మరో 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సైతం కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందన్నారు.
అమరావతిలో ప్రాంతంలో 50 కోట్ల రూపాయలతో ప్రాంతీయ తపాలా కార్యాలయ నిర్మాణం త్వరలోనే చేపడతామని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అలానే అమరావతికి రూ.2500 కోట్లతో రైల్వే లైన్ మంజూరయిందన తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని రెండు మేజర్ పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని తెలిపారు. కేంద్ర పథకాల ద్వారా మరిన్ని నిధులు రాష్ట్రానికి వస్తాయని ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా రూ.5 లక్షల మేర వైద్య సేవలు అందనున్నాయని పెమ్మసాని తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.