Tough Competition Between MLC Candidates : రాష్ట్రంలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో ఏపీటీఎఫ్కు మద్దతునిచ్చింది. ఉమ్మడి కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాల్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో ముగ్గురు ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని తెలుగుదేశం, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి.
కొందరు బీజేపి నాయకులు మాత్రం పీఆర్‌టీయూ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్సీపీ దూరంగా ఉంది. ఉమ్మడి గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా 35 మంది, కృష్ణా-గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు.
ఉత్తరాంధ్రలో నువ్వానేనా:
- స్థానం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ
- ప్రస్తుత ఎమ్మెల్సీ: పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్)
- ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ: పాకలపాటి రఘువర్మ (ఏపీటీఎఫ్), గాదె శ్రీనివాసులునాయుడు (పీఆర్‌టీయూ), కోరెడ్ల విజయగౌరి (యూటీఎఫ్)
- మొత్తం ఓట్లు: 22,493
పాకలపాటి రఘువర్మ: సిటింగ్ ఎమ్మెల్సీగా రఘువర్మకు విస్తృత పరిచయాలు, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన ప్రధాన సంఘాలతో అంతర్గతంగా సత్సంబంధాలు కొనసాగించడం, కూటమి పార్టీలు సంపూర్ణ మద్దతివ్వడం ఈయనకు అనుకూల అంశాలుగా ఉన్నాయి. ఉత్తరాంధ్రలోని కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో పాటు టీడీపీ, జనసేన పార్టీల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు పనిచేస్తున్నారు. బరిలోంచి వైదొలగిన సుంకరి శ్రీనివాసరావు కూడా రఘువర్మకు మద్దతుగా నిలచారు.
గాదె శ్రీనివాసులునాయుడు: పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులునాయుడిని ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉన్న ఒక ఉపాధ్యాయ సంఘం బలపర్చడంతో మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సహా మరికొందరు బీజేపీ నేతలు ఆయనకు మద్దతిస్తున్నారు. ఈయన రెండుసార్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా పనిచేయడం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని బలమైన సామాజికవర్గం ఆయనకు అండగా ఉండటం, బీజేపీ అనుబంధ, ఇతర పెద్ద ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా నిలవడం కలిసొచ్చే అంశాలు.
కోరెడ్ల విజయగౌరి: తొలిసారి బరిలోకి దిగిన మహిళగా ఆమెకు కొన్ని పక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇంక విద్యార్థి, ఉపాధ్యాయ ఉద్యమాల్లో 40 ఏళ్లుగా కీలకపాత్ర పోషిస్తూ మంచిపేరు తెచ్చుకున్నారు.
రాయదుర్గం వైఎస్సార్సీపీలో వర్గపోరు - మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల రసాభాస