CHANDRABABU REVANTH REDDY MEETING: విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ముఖ్యమంత్రుల చర్చలు సాగాయి. ఈ భేటీలో ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, ఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్ 10లోని అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలు తీసుకున్న సీఎంలు, న్యాయపరమైన చిక్కుల గురించి కూడా చర్చలు జరిపారు. చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. నిర్ణీత వ్యవధిలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
రండి రండి దయచేయండి! తమరి రాక మాకెంతో ఆనందం సుమండి! - AP and Telangana CMs Meeting
తెలుగు ప్రజలు హర్షించే మంచిరోజు: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసిన తర్వాత సమావేశానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఇవాళ తెలుగు ప్రజలు హర్షించే మంచిరోజని మంత్రి అనగాని అన్నారు. పెండింగ్ సమస్యలు త్వరగా పరిష్కరించుకోవాలని నిర్ణయించామని, రెండు రాష్ట్రాల ప్రజల భావోద్వేగాలు గుర్తించి నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు అదనపు డీజీ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు.