People Suffering With Snow in Andhra Pradesh: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో చలి పంజా విసురుతోంది. తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు దట్టంగా నలువైపులా కమ్మేయడంతో వాహనరాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్నమయ్య జిల్లాలో మంచు తీవ్రత కొనసాగుతోంది. రాయచోటిలో లైట్లు వేసుకుంటూ వాహనదారులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నారు. చలి గజగజా వణికించడంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. పొగ మంచు కారణంగా ఉద్యాన పంటల దిగుబడులపై దాని ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సార్ జిల్లాలో: వైఎస్సార్ జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ఆదివారం వేకువ జామున నుంచే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ముద్దనూరు, కమలాపురం, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో మంచు దుప్పటి అలుముకుంది. దట్టమైన పొగ మంచు కారణంగా జమ్మలమడుగు ప్రాంతంలో జాతీయ రహదారి పై వాహన చోదకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రహదారి సరిగా కనిపించకపోవడంతో వాహన చోదకులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు చలిమంటలు వేసుకుని చలి కాచుకుంటున్నారు. కొంతమంది వాహన డ్రైవర్లు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనాలను నిలిపివేశారు. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనిపించలేదు. ఈ పొగ మంచును ఆస్వాదిస్తూ కొంతమంది చిన్నారులు ఆనందంతో కేరింతలు కొడుతూ ఆడుకున్నారు
రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు భారీగా కురిసింది. దట్టమైన మంచు కారణంగా ఉదయం రాకపోకలు సాగించేవారు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కర్నూలు, చిత్తూరు, కడప, బెంగళూరు, నెల్లూరు, అనంతపురం ప్రధాన రహదారులపై వాహనదారులు తమ గమ్యస్థానాలకు సరైన సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. నగరాలు పట్టణాలలో చిరు వ్యాపారులు పాలు, పండ్లు, కూరగాయల వ్యాపారులు ఉదయం 8 గంటల వరకు రోడ్లపైకి రాలేని పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయ కూలీలు పొలం పనులకు వెళ్లేందుకు పొగ మంచు కారణంగా సకాలంలో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రా ఊటీలో: అల్లూరి సీతారామరాజు అరకులోయలో మంచు వర్షం కనువిందు చేస్తోంది. శీతాకాలం కారణంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా అరకులోయ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అరకులోయ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు ఓవైపు చలితో ఇబ్బందులు పడుతున్న వెరవకుండా మంచు వర్షం నడుమ కొత్త అనుభూతిని పొందుతున్నారు. పర్యాటకులు పొగమంచు అందాలతో మంచు వర్షంలో తడుస్తూ సరికొత్త అనుభూతి పొందుతున్నారు.
మంచు కురిసే వేళలో లంబసింగి టూర్ - అవి చూడాలి, ఇవి తినాలి
పడిపోతున్న ఉష్ణోగ్రతలు - ఏజెన్సీలో అందాలను ఆస్వాదిస్తున్న పర్యటకులు