Telangana Congress Joinings : రాబోయే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా హస్తం పార్టీలో చేరికలు, గులాబీ పార్టీలో చీలికలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ దిశగానే పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు.
తాజాగా ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్(Allu Arjun) మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చర్లపల్లి బీఆర్‌ఎస్ కార్పొరేటర్ శ్రీదేవి, ఫ్రొఫెసర్ బానోత్ రమణ నాయక్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వీరందరికీ గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపదాస్ మున్షీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఇతర నేతలంతా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.
Patnam Sunita Mahender Reddy Join in Congress :అంతకు ముందు సునీతా మహేందర్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ మేరకు లేఖను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఆమె తన రాజీనామా లేఖను పంపారు. ఇవాళ మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు, రంగారెడ్డి జడ్పీ ఛైర్‌పర్సన్ అనితారెడ్డి, జీహెచ్‌ఎంసీ ఉప మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతలు కూడా ఇవాళ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. కానీ వారు నలుగురు పార్టీలో చేరలేదు. మరో వైపు మునుగోడు నియోజక నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి దీపాదాస్ మున్షీతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. రేపో మాపో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ongress Election Strategy : మొదట్లో లోకసభ ఎన్నికల తరువాత చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ వైపు చొరవ చూపుతున్న నాయకులను చేర్చుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇదే అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలను ఏఐసీసీ(AICC) దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందినట్లు తెలుస్తోంది.