TDP Ra Kadali Ra Programme in Jeedi Nellore: వైఎస్సార్ హయాంలో జరిగిన అవినీతి బయటపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 42 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తేలినట్లు ఆయన ప్రకటించారు. చనిపోయిన ఆ తండ్రిపైనే కేసు పెట్టాలన్న ఘనుడు జగన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని జీడీ నెల్లూరులో నిర్వహించిన 'రా.. కదలిరా' సభలో పాల్గొన్నారు.
దాదాపు 7నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన ఈ సభకు అభిమానులు ప్రజలు భారీగా తరలివచ్చారు. తమిళనాడు నుంచి 50 కోట్ల రూపాయలు తరలిస్తుంటే దోపిడీ జరిగిందని, వాస్తవాలు బయటకు వస్తాయని దోపిడీ ఘటనను నిర్వీర్యం చేశారని టీడీపీ అధినేత ఆరోపించారు. కుటుంబకలహాలతో జగన్ కుటుంబం రోడ్డెక్కే స్థితికి వచ్చారని, ఆస్తుల పంపకం సరిగా జరగలేదని సొంత సోదరే తిరగబడిందన్నారు. అంత:పుర రహస్యాలు వారే చెబుతున్నారని, కుటుంబ గొడవలను రాష్ట్ర వ్యవహారంగా మార్చారని చంద్రబాబు దుయ్యబట్టారు. వారి బాబాయ్‌ను వారే చంపుకొని తనపై అపవాదు మోపారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అపవాదులు మోపి నిరూపణలో విఫలమయ్యారని అన్నారు.
స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా?: చంద్రబాబు
ఓటును రిమోట్ కంట్రోల్ ద్వారా తొలగించాలని యత్నించారని చంద్రబాబు మండిపడ్డారు. ఈసీ కార్యాలయంలో దస్త్రాలను ఐప్యాక్ మాయం చేసిందని అన్నారు. తిరుపతికి చెందిన అన్ని దస్త్రాలను ఆ సంస్థ మాయం చేసిందన్నారు. దస్త్రాల చోరీ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిందితులను శిక్షించే వరకు వదిలిపెట్టేది లేదని వెల్లడించారు. స్మగ్లర్లకు ఓటు వేయవద్దని ప్రజలను కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక స్కామేనని చంద్రబాబు విమర్శించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి రాష్ట్ర ప్రజల నెత్తిన చేయి పెట్టిన భస్మాసురుడు జగన్ అని చంద్రబాబు మండిపడ్డారు. అన్యాయం చేసిన భస్మాసురుడిని ఓటు ద్వారా భస్మం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్‌తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు
మద్యపాన నిషేధం అమలు చేయకపోతే ముఖ్యమంత్రి జగన్ ఓటు అడగబోనన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. మద్యంపై 25 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చారని వివరించారు. రాష్ట్రాన్ని దోచేసిన బకాసురుడు జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. మద్యం, ఇసుక విధానం పెద్ద కుంభకోణమని అన్నారు. పాపాల పెద్దిరెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని, ఇసుక, మద్యం, గనులు, గ్రానైట్ అన్నీ దోచేశారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గుత్తేదారులు, స్మగ్లర్లంతా వైఎస్సార్సీపీ నేతలేనని విమర్శించారు. పోలీసు వ్యవస్థను సైతం నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.