Kanakamedala Ravindra Letter to ECI :పులివెందుల అసెంబ్లీపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ టీడీపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని ఈసీఐ ఆదేశించినా కొంతమంది అధికారులు అధికార పార్టీ ఒత్తిడితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పులివెందులలో జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ధి బీటెక్ రవి నియోజకవర్గంలో తగు చర్యలు కోరుతూ గతంలోనే ఈసీఐకి లేఖ రాసారని గుర్తు చేసారు.
వ్యక్తిగత భద్రతతో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించిన కె. అశోక్ రెడ్డిని వెంటనే బదిలీ చేయాంటూ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పెంచాలని లేఖలో కనకమేడల ప్రస్తావించారు. పులివెందుల చినచౌక్, రూరల్ ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడ్డి గత ఐదేళ్లుగా ఒకే స్థానంలో పని చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. కానీ, జిల్లా ఎస్పీ అది ఫంక్షనల్ పోస్ట్ అంటూ ఎన్నికల సంఘం ఫంక్షనల్ ఫోస్టలకు అభ్యంతరం తెలిపలేదంటూ కవరప్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నన్ను అంతమొందించేందుకు జగన్ కుట్ర పన్నారు: బీటెక్ రవి
జగన్ రెడ్డిపై పోటీ చేస్తున్న బీటెక్ రవికి ఎటువంటి ప్రాణహాని లేదని స్థానిక ఎస్సీ చెప్పడం వాస్తవ విరుద్ధమని అన్నారు. రవికి భద్రత కల్పించే విషయంలో ఎన్నికల అధికారులైన డీఈఓ, సీఈఓలు ఎటూ తేల్చకపోవడం ఎన్నికల అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల ఎంపికలో ఎన్నికల అధికారులు, పోలీసులు పోటీ చేస్తున్న అభ్యర్ధులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఈసీఐ చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. కానీ, స్థానిక ఎస్పీ పులివెందులలోని మొత్తం 68 కేంద్రాలలో కేవలం 32 మాత్రమే సమస్యాత్మక కేంద్రాలని ఏకపక్ష నిర్ణయం చేసారని దుయ్యబట్టారు.