Tiruvuru MLA Kolikapudi Issue : టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన వివాదాస్పద వ్యవహారశైలిపై అధిష్ఠానం వివరణ కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ కొలికపూడి హాజరై కమిటీ సభ్యులకు నేరుగా, రాతపూర్వకంగా తన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అందరిని కలుపుకుపోవాల్సిందే అని క్రమశిక్షణ కమిటీ కొలికిపూడికి స్పష్టం చేసింది.
సొంత అజెండాలతో పనిచేయటం సరికాదని టీడీపీ క్రమశిక్షణ కమిటీ కొలికపూడి శ్రీనివాసరావుకి సూచించింది. బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చురక అంటించింది. వరుస వివాదాల పట్ల ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారని ఆయనకు తెలిపింది. ఏడు నెలల్లో ఎమ్మెల్యే తమ ముందు రెండు సార్లు హాజరవ్వడం సాధారణ విషయం కాదని వ్యాఖ్యానించింది. త్వరలో చంద్రబాబుకు కొలికిపూడి వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని నిర్ణయించింది.
కలిసి పనిచేస్తున్నారు : క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు 11వ తేదీ జరిగిన పరిణామాలన్ని వివరించానని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరు జరిగిన వాస్తవం వేరని చెప్పారు. తిరువూరు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసన్న ఆయన క్రమశిక్షణ సంఘం సభ్యులకు రాతపూర్వకంగానూ నేరుగాను కలిసి వివరణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. తనను తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి వారంతా తనతోనే ఉన్నారని తెలియజేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఎవరూ దూరం పెట్టరని కొలికపూడి వ్యాఖ్యానించారు.
"సోషల్ మీడియాలో వచ్చేది వేరు జరిగిన వాస్తవం వేరు. తిరువూరు ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. క్రమశిక్షణ సంఘం సభ్యులకు రాతపూర్వకంగా, నేరుగా కలిసి చెప్పాను. నాపై ఫిర్యాదు చేసిన వాళ్లే ఇవాళ నాతో కలిసి పనిచేస్తున్నారు. తప్పుగా అర్థం చేసుకున్నామని చెప్పి నాతోనే ఉన్నారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను ఎవరూ దూరం పెట్టరు." - కొలికపూడి శ్రీనివాసరావు, తిరువూరు ఎమ్మెల్యే
Kolikapudi Attend TDP Disciplinary Committee : తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి 11వ తేదీ ఏం జరిగిందనేది చెప్పారని క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కొనకళ్ల నారాయణ వెల్లడించారు. గోపాలపురం మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో వివరాలు అడిగామని తెలిపారు. ఎమ్మెల్యే చెప్పిన విషయాలను అధిష్ఠానానికి పంపిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ వాళ్లు కంచ వేయడం వల్లే తాను ఆ కంచెను తొలగించానని ఆయన స్పష్టం చేసినట్లు కొనకళ్ల వివరించారు. తెలుగుదేశం పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాలని మరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. కార్యకర్త అయినా ఎమ్మెల్యే అయినా టీడీపీలో ఒకటేనన్నారు. తిరువూరు ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నారు అని తెలుస్తోందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.