Achchennaidu's Complaint Against Sajjala Ramakrishna Reddy:సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు ఓట్లు ఉండటంపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సజ్జల కుటుంబ డబుల్ ఓట్ల వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు చేర్చుతూ, ప్రతిపక్ష సానుభూతిపరుల ఓట్లు తొలగించడంపై ప్రత్యేక డ్రైవ్ సందర్భంలో ఎన్నికల సంఘానికి అనేకమార్లు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. అయినా, కొంతమంది డీఈఓలు, ఈఆర్ఓలు లెక్క చేయకుండా అధికార పార్టీతో కుమ్మక్కై వారి డబుల్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు తొలగించలేదని అన్నారు.
ప్రత్యేక విచారణ జరపాలి: సీఎం జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి రెండు ఓట్లు ఉండటం, ఓటర్ లిస్టులోని అవకతవకలకు ఒక క్లాసిక్ ఉదాహరణ అని అచ్చెనాయుడు పేర్కొన్నారు. సజ్జల కుటుంబానికి మంగళగిరి, పొన్నూరు రెండు నియోజకవర్గాలలో ఓట్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలను లేఖతో జత చేశారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబ సభ్యల వ్యవహారంపై ఒక ప్రత్యేక విచారణ చేయించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, సెక్షన్ - 31 ప్రకారం సజ్జల కుటుంబంపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. సజ్జల కుటుంబం డబుల్ ఓట్లు తొలగించకుండా ఆయనతో కుమ్మక్కైన ఈఆర్ఓలపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
పొత్తుల కోసం వెంపర్లాడటం చూస్తే టీడీపీ బలహీనత బయటపడుతోంది: సజ్జల రామకృష్ణారెడ్డి
వైఎస్సార్సీపీ గూండాలు: 2021 స్థానిక సంస్థల ఎన్నికల సంధర్బంలో ఎన్నికల సంఘాన్ని దూషిస్తూ, జిల్లా కలెక్టర్లను బెదిరించిన మంత్రి పెద్దిరెడ్డిపై సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంత్రి చిత్తూరులో అరాచకాలు సృష్టించే అవకాశం ఉందంటూ కమిషన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ గూండాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను సైతం లెక్క చేయలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించిన తనపై మౌఖిక దాడులకు దిగారన్నారు. దీంతో తనను, తన కుటుంబసభ్యులను అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని, ఎస్ఈసీ రక్షణ కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి లేఖ రాయాల్సి వచ్చిందని అన్నారు. నాడు పెద్దిరెడ్డి కలెక్టర్లను బెదిరిస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను అచ్చెన్నాయుడు లేఖకు జత చేశారు. ఆ వీడియోలో మంత్రి పెద్దిరెడ్డి అహకారపూరిత ధోరణి, రాష్ట్ర ఎన్నికల సంఘంపై ఆయన చేసిన వ్యాఖ్యలను చూడొచ్చని తెలిపారు.
సజ్జల కుటుంబానికి డబుల్ ఓట్లు - ఓటర్ల జాబితాలో పారదర్శకతకు తూట్లు
స్వతంత్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలి: చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు బోర్డర్ లో ఉంది. చిత్తూరు నుంచి పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని ఇందులో పెద్దిరెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన వాడు కావడంతో అరాచకాలు, అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చిత్తూరు జిల్లా రాజకీయ పరిస్థితులపై స్వతంత్ర ఏజెన్సీతో విచారణ చేయించి, శాంతియుత ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పారదర్శక ఎన్నికలు నిర్వహణకు పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను, పరిశీలకులను నియమించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
పొన్నూరులో ఓటు కావాలని సంతకాలు చేసిందెవరు సజ్జల?: ధూళిపాళ్ల నరేంద్ర