TDP Chief Chandrababu Naidu Interview : ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వూలో చంద్రబాబు కీలక విషయాలు వెల్లడించారు. అధికార వైసీపీ అన్నింట్లోనూ పూర్తిగా విఫలమైందని, హామీలు నెరవేర్చకుండా మోసం చేసిందని ప్రజలంతా గ్రహించారని తెలిపారు. దీంతో ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశా భావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి 25కి 24 లోక్‌సభ సీట్లు, 175కి 160 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఏపీకి ప్రత్యేత హోదా సాధించాలని గతంలో ఎంతగానో ప్రయత్నించామని, కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గత అయిదేళ్లుగా ఆ విషయాన్ని పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపించారు. దీంతో ప్రస్తుతం తాను పోరాడినా సరే అంతగా ఉపయోగం లేదని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేశారని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో అన్ని రంగాల్లోనూ అవినీతి పేరుకుపోయిందని విమర్శించారు.
అప్పుల్లో కూరుకుపోయింది: రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని, ఉద్యోగులుక జీతాలు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, ప్రజల్లో అధికార పార్టీపై విపరీతమైన వ్యతిరేకత ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ వైఖరి చూశాకా, ఏ పార్టీ అభివృద్ధి చేస్తుందో ప్రజలకు తెలిసిందని చెప్పారు.
వైసీపీది రౌడీయిజం - ఓటమి భయంతోనే హింసా రాజకీయాలు : చంద్రబాబు - Chandrababu Slams YSRCP
అందుకే టీడీపీ- జనసేన- బీజేపీ కలిశాయి: ఏపీలో భారతీయ జనతా పార్టీకి బలం లేకపోయినా సరే, రాష్ట్రంలో ప్రజలు కష్టాలు తీర్చేందుకే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన వల్ల కంటే వైసీపీ హయాంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా నష్టపోయారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బాధలను మరోసారి చూడాలి అనుకోవడం లేదని, అందుకే టీడీపీ-జనసేన-బీజేపీ కలిశాయన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకొస్తామని తెలిపారు. ఆంధ్ర ప్రజలకు మంచి భవిష్యత్తును ఇస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ పాలనలో గ్రామాల్లో నీళ్లు, కరెంటు, సరైన రోడ్లు లేవని చంద్రబాబు చెప్పారు. సామాన్య ప్రజలు తమకు వచ్చిన తక్కువ వేతనాలతో రాష్ట్రంలో బతకడం కష్టంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితులలో అధికారులు ఎవరూ ఆంధ్రప్రదేశ్‌లో పని చేయడానికి ఇష్టపడట్లేదని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా వైసీపీ మోసం చేసిందో ప్రజలంతా చూశారని, అందుకే కూటమికి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయించారన్నారు.