Chandrababu Naidu on Postal Ballot Voting :రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మే 13న జరిగే పోలింగ్ ప్రజల కోసం, రాష్ట్రం భవిష్యత్తు కోసమని చంద్రబాబు అన్నారు. అందుకే ఎన్నడూ లేనంత విధంగా ఉద్యోగులు బ్యాలెట్ ఓటింగ్‌లో పాల్గొన్నారన్నారు. పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ సందర్భంగా వైఎస్సార్సీపీ వాళ్లు డబ్బులిచ్చినా ఉద్యోగులు తీసుకోలేదని, ఒక్క ఉద్యోగి కూడా సైకో జగన్‌కు ఓటు వేయలేదని, టీడీపీకు ఓటేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మార్పు మొదలైందని, కూటమి ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వారిని అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రసంగించిన ఆయన మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో సగం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు.
పాసుపుస్తకాల కాపీలు దహనం :జగన్ లాంటి అరాచకవాదిని ఇంటికి పంపించకుంటే ప్రజల ఆస్తులపై ఆశలు వదులుకోవాల్సిందేనని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాల కాపీలు దహనానికి పిలుపునిచ్చారు. నేడు సాయంత్రం 4గం.కు వీధుల్లోకి వచ్చి కాపీలు తగలబెట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. వారసత్వంగా వచ్చిన భూములు, తాతలు సంపాదించిన పొలాల పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రాజముద్ర వేసి పాసు పుస్తకాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Chandrababu Today Schedule :రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుతోంది. ఈ నెల 11న సాయంత్రం 6 ఎన్నికక ప్రచారం ముగుస్తోంది. ఇప్పటివరకు పర్యటించని ప్రాంతాల్లో నియోజకవర్గ, జిల్లా నేతలతో ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. పలమనేరులో మార్చి 27న 'ప్రజాగళం' పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించారు. నేడు చివరి రోజు కావడంతో నంద్యాల, చిత్తూరులో చంద్రబాబు ప్రజాగళం సభలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిశాక తిరుమల శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.