TDP Chandrababu Naidu Delhi Tour: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోరాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపు మేరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిల్లీ చేరుకున్నారు. ఈ రాత్రికి అమిత్ షా నివాసంలో బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం వెళ్లారు.
గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమయ్యారు. రాత్రికి దిల్లీలోనే చంద్రబాబు బస చేయనున్నారు. చంద్రబాబు దిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. దిల్లీ బయలుదేరే ముందు అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యనేతలతో తాజా రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. చంద్రబాబుతో సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర పార్టీ నేతలు కళా వెంకట్రావు, రామానాయుడు, డోలా బాలవీరాంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు.
దిల్లీ నుంచి పిలుపు వచ్చిందని నేతలతో అన్న చంద్రబాబు, అక్కడకు వెళ్లాకే ఎందుకు పిలిచారు ఏంటి అనేది తెలుస్తుందని నేతలతో అన్నట్లు సమాచారం. అక్కడకు వెళ్లాకే ఎందుకు పిలిచారన్న విషయం తెస్తుందని నేతలతో అన్నట్లు సమాచారం. అక్కడ సమావేశం అనంతరం, చర్చించి నిర్ణయం తీసుకుందామని తెలుగుదేశం నేతలతో అన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు భేటీ - లోపాలను సరిదిద్దుకోవాలని సూచన
చంద్రబాబు దిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ: చంద్రబాబు దిల్లీ పర్యటన ఎందుకు అని రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చలు మొదలయ్యాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు బీజేపీ కూడా పొత్తులో చేరే అవకాశం ఉందని, చంద్రబాబు పర్యటన అందుకే అని చర్చ జరుగుతోంది. పొత్తు కోసమే బీజేపీ నేతలతో చంద్రబాబు నాయుడు దిల్లీ పయనమవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఈ రోజు సాయంత్రం ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు, అక్కడ ఎంపీ గల్లా జయదేవ్ నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాత్రికి అక్కడే చంద్రబాబు బస చేయనున్నారు. ఈ రోజు రాత్రికి, లేదంటే రేపు అమిత్‌షాతో చంద్రబాబు సమావేశం అవుతారు. అమిత్ షాతో సమావేశం అనంతరం రేపు సాయంత్రం తిరిగి అమరావతికి తిరిగి రానున్నారు.
జనసేనతో సీట్ల సర్దుబాటు:అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే రోజులో రెండు సార్లు భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై దాదాపు మూడు గంటలకు పైగా చర్చించారు. దీంతో ఈ భేటీలో పొత్తులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం మరో సారి ఇద్దరు నేతలు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇరు పార్టీల నుంచి సీట్ల సర్థుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టో, బహిరంగ సభలపై స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమిత్‌షాతో చంద్రబాబు భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది.