TDP Chandrababu Challenge to CM Jagan: వైనాట్ 175 అంటున్న జగన్ ముందు పులివెందులలో గెలిచి చూపించు అని టీడీపీ చంద్రబాబు సవాల్ విసిరారు. బీసీలు, దళిత ఎమ్మెల్యేల సీట్లు మారుస్తున్నారన్న ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని 10 మంది మంత్రులు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీచేయకపోవడం ఆ పార్టీ దౌర్భాగ్య స్థితిని తెలియజేస్తుందన్నారు. పత్తికొండలో నిర్వహించిన "రా-కదలిరా" సభలో పాల్గొన్న ఆయన ఈ మేర ఘాటు వ్యాఖ్యానించారు.
జగన్ వచ్చాక రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్న చంద్రబాబు 'అన్న క్యాంటీన్', 'చంద్రన్న బీమా', 'విదేశీ విద్య ఇప్పుడు ఉందా'? అని ప్రశ్నించారు. జగన్‌కు తెలిసింది.. రద్దులు, కూల్చివేతలు, దాడులు, కేసులే అని ధ్వజమెత్తారు. జగన్ అహంకారం దింపేందుకు రాష్ట్రంలోని ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
జగన్ పతనం ప్రారంభం- భస్మాసుర వధ బాధ్యత ఐదు కోట్ల ఆంధ్రులది : చంద్రబాబు
జాబ్ క్యాలెండర్ జగన్ మోసం:జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారన్న టీడీపీ అధినేత యువతకు జాబ్ రావాలంటే బాబు రావాలని అన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయడంలేదనే బాధ యువతలో కనిపిస్తోందన్న చంద్రబాబు, టీడీపీ అధికారంలోకి వచ్చాక యువగళం కింద ఏటా 4 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి లేక వలస వెళ్తున్న యువతకు భరోసా ఇచ్చేందుకే వచ్చానని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎవరు ఎక్కడికీ వెళ్లనక్కర్లేదన్న ఆయన, ఇంట్లో కూర్చునే పనిచేసుకోవచ్చంటూ భరోసా కల్పించారు. జగన్‌కు ఏమీ తెలియదన్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు ఐటీకి ప్రాధాన్యమివ్వటంతో ఇప్పుడు మనవాళ్లు ప్రపంచమంతా వెళ్లారన్నారు.
జగన్ కేవలం బిల్డప్ బాబాయ్.. ఆయనకేమీ తెలియదు:జగన్ కేవలం బిల్డప్ బాబాయ్ అని చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నంద్యాలలోని ముస్లీంలకు జగన్ ఏమైనా సాయం చేశారా?అని ప్రశ్నించారు. టీడీపీ ఇచ్చిన రంజాన్ తోఫా, దుల్హన్ పథకాలు తీసేశారన్నారు. వైఎస్సార్సీపీ వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పరిపాలనలో బీసీలపై దాడులు పెరిగాయన్న చంద్రబాబు, బీసీలను అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. జగన్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన టీడీపీ-జనసేన గెలుపును ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు.