TDP 42nd Foundation Day Celebrations :తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో పురుడు పోసుకుని రు నెలల్లోనే అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ వేడుకలను తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం జెండాలను ఎగురవేసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. 4 దశాబ్దాలుగా బడుగు, బలహీన వర్గాలకు పార్టీ అండగా నిలిచిందని నాయకులు తెలిపారు. ఓటర్లుగా మిగిలిపోయిన అనేక సామాజిక తరగతులను అధికారానికి చేరువ చేసిందన్నారు.
అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండానే అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో పార్టీ శ్రేణులతో కలసి భువనేశ్వరి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. 42 ఏళ్లుగా పసుపు జెండా భుజాన మోస్తున్న కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి పెట్టనికోటని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు కొనియాడారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పొలిట్‌బ్యూరో సభ్యులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం తెలుగుదేశం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
42వ వసంతంలోకి టీడీపీ - పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపిన చంద్రబాబు - TDP Formation Day Celebrations
గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవి పాల్గొని కేక్ కట్ చేశారు. మంగళగిరి, బాపట్ల, చీరాలలోనూ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్టూరులో నిర్వహించిన వేడుకల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, బాపట్ల తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి టి.కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, గరటయ్య, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు.