SC on MLA Pinnelli Case :ఏపీలోని మాచర్లఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నెల 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాచర్లలో ఈవీఎం ధ్వంసం ఘటనలో అడ్డుకునేందుకు యత్నించిన నంబూరి శేషగిరిరావు తనకు ప్రాణభయం ఉందని, పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్టు చేయాలని, అరెస్టుకు హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు ఎత్తివేయాలని నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నెల 6 వరకు అరెస్టు చేయవద్దన్న వెసులుబాటు ఎత్తివేయాలని పిటిషన్ దాఖలు చేయగా, ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీం ఆదేశించింది.
పిన్నెలి రామకృష్ణా రెడ్డికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఇచ్చిన రక్షణపైనా నంబూరి శంకర రావు దాఖలు చేసిన ఎస్ఎల్పీపైనా ఈ రోజు సుప్రీంకోర్టులో జస్టిస్ అరవింద్ కుమార్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తప్పు పట్టింది. ఇది న్యాయాన్ని అవహేళన చెయ్యటమే అని మండిపడింది. సీనియర్ న్యాయవాది ఆది నారాయణ, జవ్వాజి శరత్‌లు వాదిస్తూ ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన వెబ్ కాస్టింగ్ వీడియోలను ధర్మాసనం ముందు ప్రదర్శించారు. అది చూసి రామకృష్ణా రెడ్డికి సంబంధించిన న్యాయవాదిని దీనికి ఏం సమాధానం చెప్పగలవు అని అన్నారు. దాని గురించి తానేమీ అనదలుచుకోలేదు అని అన్న తర్వాత కోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్‌కు సంబంధించిన పరిసరాల్లోకి రాకూడదని, ఆ విధంగా ఒప్పుకుంటున్నట్టు అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణలో అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని మాత్రమే హైకోర్టు తగు ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొంది.