State Investment Promotion Board Meeting:రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు కీలకమైన ప్రతిపాదనలకు ఆమోదాన్ని తెలియచేసింది. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 3వ సమావేశం నిర్వహించారు. మొత్తం 15 ప్రాజెక్టులకు సంబందించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ ఎస్ఐపీబీ నిర్ణయం తీసుకుంది. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 19,580 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపైనా సీఎం చర్చించారు.
మూడు నెలల్లోగా అనకాపల్లిలో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ లాంటి భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన నిర్వహించేలా ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అల్లూరి జిల్లాలో నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న 2300 మెగావాట్ల ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. రూ.14,328 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదాన్ని తెలియచేశారు. అన్నమయ్య జిల్లాలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన సమర్పించింది.
రూ.10,300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చేసిన ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదం తెలిపింది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 118 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు యాస్పరీ లిమిటెడ్‌కు ఆమోదం తెలిపారు. రూ.972 కోట్లతో అనంతపురంలో అనంతపూర్ రెన్యూవబుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది. రూ.1163 కోట్ల పెట్టుబడితో సత్యసాయి జిల్లాలో కడప రెన్యూవబుల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ఆమోదం ఇచ్చారు. 201 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరిన్ సంస్థ ప్రతిపాదనను ఎస్ఐపీబీలో ఆమోదం తెలిపారు.
కర్నూలు జిల్లాలో రూ.4435 కోట్లతో ఆయానా రెన్యుబుల్ పవర్ లిమిటెడ్‌కు ఆమోదం తెలియచేశారు. యాంపిన్ సంస్థ రూ.3142 కోట్లతో ఏర్పాటు చేయనున్న 350 మెగావాట్ల పవన సౌర విద్యుత్ ప్లాంట్‌కు ఆమోదం తెలిపారు. రూ.3456 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఏఈఎల్ ప్రతిపాదనకు ఎస్ఐపీబీ ఆమోదం తెలియచేసింది. రూ.2 వేల కోట్లతో అనంతపురంలో 400 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు టాటాపవర్‌కు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.