YCP leader irregularities in Vizianagaram:విజయనగరం జిల్లాలోని ఆ ప్రజాప్రతినిధి పేరులో దేవుడి పేరున్నా, చేసేవన్నీ అక్రమాలే. నియోజకవర్గంలో ఎవరైనా పెద్ద వ్యాపారం ప్రారంభిస్తే అందులో వాటా అయినా ఇవ్వాలి. లేదంటే ఆయన నడిపించే చిట్‌ఫండ్ సంస్థలో చిట్టీ అయినా కట్టాలి. కాదూ, కూడదంటే అధికార బలంతో ఇబ్బందులు సృష్టించి వేధిస్తారు. స్థిరాస్తి లేఅవుట్‌లకు అనుమతులు కావాలంటే తొలుత ఈ నాయకుడికి సంబంధించి కౌంటర్ 1, కౌంటర్ 2 అని పిలిచే ఇద్దరు వ్యక్తుల్ని కలవాల్సిందే.! వారు చెప్పినట్లుగా చిట్‌ఫండ్ సంస్థలో కనీసం 50 లక్షల నుంచి కోటి రూపాయల విలువైన చిట్టీ వేయాల్సిందే.
నియోజకవర్గంలో వివాదాస్పద భూముల సమాచారం తెప్పించుకోవడం, ఇరువర్గాల్ని సెటిల్‌మెంట్‌కు పిలిచి చివరకి ఆ భూమిని తానే నామమాత్రపు ధరకు కొట్టేయడం.. ఆయన స్టైల్.! పోలీసుస్టేషన్‌కు వెళ్లే ఒకటీ అరా భూతగాదాలను సైతం తన వద్దకే రప్పించుకొని పంచాయితీలు చేస్తుంటారు. జూట్ మిల్లులకు సంబంధించిన స్థలాలు అమ్మి కార్మికులకు బకాయిలు చెల్లించటానికి యాజమాన్యాలు సిద్ధపడగా ఈ నాయకుడు బినామీ పేర్లతో వాటిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. వాటిల్లో స్థిరాస్తి లేఅవుట్‌లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల విలువ వందల కోట్లు పలుకుతోంది.
రెవెన్యూ, పోలీసు, నగరపాలక సంస్థ, రిజిస్ట్రేషన్లు తదితర ప్రభుత్వ శాఖల్లో, ఈ ప్రజాప్రతినిధి చెప్పిందే జరుగుతుంది. తన ఆదేశాలు పాటించే అధికారులనే, అక్కడికి తెచ్చిపెట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో పాసు పుస్తకాల జారీ, మ్యుటేషన్లు వంటివి ఏం చేయాలన్నా ఈ నాయకుడి అనుమతి తప్పనిసరి. కోటి దాటిన ప్రతి రిజిస్ట్రేషన్ లావాదేవీ ఆయన దృష్టికి వెళ్లాల్సిందే. వాటిని అడ్డం పెట్టుకుని యజమానుల నుంచి ఎంతోకొంత వసూలు చేస్తారు. ఇటీవల ఓ వైద్యుడు భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగా, ముందు వెళ్లి ప్రజాప్రతినిధిని కలవాలనీ, ఆయన అనుమతిచ్చాకే రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు చెప్పడంతో నివ్వెరపోవడం వైద్యుడి వంతైంది.