తెలంగాణ

telangana

ETV Bharat / politics

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - ఉప్పల్​ స్టేడియంలో మ్యాచ్‌ రద్దు - Rain in Telangana - RAIN IN TELANGANA

Weather Report Today : హైదరాబాద్‌ను మరోసారి భారీవర్షం ముంచెత్తింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. కూకట్​పల్లిలో మొదలై క్రమక్రమంగా సికింద్రాబాద్, అల్వాల్, బేగంపేట్, ఎల్బీనగర్ వరకు విస్తరించింది. ఇవాళ పడిన వర్షానికి అత్యధికంగా హైదరాబాద్​లోని షేక్​పేట్​ మండలంలో 86.5 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా సికింద్రాబాద్​లోని 63.5 మి.మీ వర్షపాతం ఉంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రమంతటా పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది.

Rain in Hyderabad
Weather Report Today (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 3:05 PM IST

Updated : May 16, 2024, 10:49 PM IST

Rain Today : హైదరాబాద్​లో మరోసారి వరుణుడు దండెత్తాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. నగరంలోని కూకట్‌పల్లిలో ముందుగా వర్షం మొదలైంది. అక్కడి నుంచి నిజాంపేట్, హైదర్‌నగర్‌, బాచుపల్లి, సికింద్రాబాద్, బోయిన్​ పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జీడిమెట్ల, సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు విస్తరించింది. అటు హిమాయత్ నగర్, సచివాలయం, దిల్​సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. నగరంలోని మిగతా ప్రాంతాలకూ కూడా వర్షం విస్తరిస్తూ పోయింది.

బంజారాహిల్స్ రోడ్ నెం.9లో వరద ఉద్ధృతికి నాలా దెబ్బతింది. నాలా గోడలు కూలడంతో సమీప నివాసాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఖైరతాబాద్​లోని చింతల్ బస్తీలో 17 చోట్ల వరద నీరు నిలిచిపోయింది. రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ సిబ్బంది మ్యాన్ హోల్స్ తెరిచి వరద నీటిని మళ్లిస్తున్నారు. మరోవైపు భారీవర్షంతో జీహెచ్​ఎంసీ అప్రమత్తమైంది. వాననీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ట్రాఫిక్ నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. విద్యుత్ శాఖ ముందు జాగ్రత్తగా పలు ప్రాంతాల్లో కరెంట్ నిలిపివేశారు. ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. హిమాయత్ నగర్​లో ఓ చెట్టు కూలిపోయింది. యూసఫ్ గూడ శ్రీకృష్ణనగర్​లో వాన ముంచెత్తింది. దీంతో వాహనాలు సైతం వరద నీరు ధాటికి కొట్టుకుపోయాయి.

యూసఫ్ గూడ శ్రీకృష్ణనగర్​లో వాన (ETV Bharat)

Heavy Rain in telangana :మరోవైపు హైదరాబాద్​లో కురుస్తున్న వర్షం ప్రభావం ఇవాళ ఉప్పల్​లో జరగనున్న సన్​రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటన్స్ మధ్య ఎక్కడ ఆగిపోతుందోనని ఐపీఎల్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఉప్పల్‌ పరిసరాల్లో సాయంత్రం ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురవగా మళ్లీ రాత్రి 8 గంటలకు వర్షం పడింది. మైదానాన్ని గ్రౌండ్ సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ రాత్రి 7 గం.కు మ్యాచ్ ప్రారంభం కానుండగా మరింత ఆలస్యంగా జరగనుంది. ప్లే ఆఫ్‌ చేరుకోవాలంటే సన్‌రైజర్స్ టీమ్ ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఒకవేళ మ్యాచ్ సాగకపోతే అది సన్​రైజర్స్ ప్లై ఆఫ్ అవకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

ఉప్పల్​ స్టేడియంలో వర్షం (ETV Bharat)

Heavy Traffic in Hyderabad :భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. చాలా చోట్ల వర్షం నీటితో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు మార్గాలల్లో ట్రాఫిక్‌ ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఎంజే మార్కెట్‌, అబిడ్స్‌, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై ప్రవహిస్తోంది. ఖైరతాబాద్‌ సర్కిల్‌ వద్ద భారీ ఎత్తున నీరు చేరడంతో మోకాలు లోతు నీరు వచ్చింది. దీంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఈ వర్షం ఆగినా ట్రాఫిక్‌ సమస్య మాత్రం ఇప్పట్లో క్లియర్​ అయ్యేటట్లు కనిపించడం లేదు. రాత్రి వరకు వాహనదారులకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు.

సికింద్రాబాద్​లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మోండా మార్కెట్, రాణిగంజ్​, బండిమెట్ ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు రహదారిపై చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాణిగంజ్ ప్రధాన రహదారిపై మిట్ట మధ్యాహ్నం వెలుగు లేకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వాహనాలను నడుపుతున్నారు.

రహదారులపై ముంచెత్తిన వర్షపు నీరు (ETV Bharat)

slab collapse in banjara hills Due to rain : బంజారాహిల్స్ డివిజన్​లోని ఉదయనగర్ కాలనీలో భారీ వర్షానికి నాలా స్లాబ్ కొట్టుకొని పోయింది. అదే ప్రాంతంలో వర్షం దాటికి టూ వీలర్లు సైతం వరదలు కొట్టుకుపోయాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వెంటనే ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులను మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. నగరంలోని డీడీ కాలనీలో భారీ వర్షానికి చెట్లు కూలాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని నాయిని నర్సింహారెడ్డి స్టీల్‌ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది. వంతెనపైకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

చాదర్‌ఘాట్‌ రైల్వేట్రాక్ కింద వర్షపు నీరు నిలిచిపోయింది. పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి రాకపోకలకు గంటపాటు తీవ్ర అంతరాయం జరిగింది. చిన్న వాహనాలు నిలిచినప్పటికీ ఆర్జీసీ బస్సులు వెళ్తున్నాయి. అదే విధంగా చంపాపేట్ చౌరస్తా వద్ద వర్షపు నీరు నిలవడంతో కార్లు ఇతర వాహనాలు మునిగిపోయాయి. రాకపోకలు ఇబ్బందికరంగా మారి వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారు. చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, చైతన్యపురి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

చాదర్‌ఘాట్‌ రైల్వేట్రాక్ కింద వర్షపు నీరు (ETV Bharat)

Huge Traffic Jam in Hyderabad : అబ్దుల్లాపూర్​మెట్​, ఎల్బీనగర్, నాగోల్, మన్సురాబాద్​, వనస్థలిపురం, బి.యన్.రెడ్డి నగర్, హయత్​నగర్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో వనస్థలిపురం, పనామా, సుష్మ, చింతలకుంట, విజయవాడ జాతీయ రహదారిపై వర్షపు నీరు చేరి వాహనదారులకు ఇబ్బందిగా మారింది.

కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రోడ్డుపైకి రావటంతో మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మాదాపూర్ నుంచి కేపీహెచ్‌బీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. మైండ్‌స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. మాదాపూర్‌ నెక్టార్ గార్డెన్, శిల్పారామం సైబర్ గేట్ వే రోడ్లపై వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఎల్బీనగర్​లో భారీ వర్షం (ETV Bharat)

CM Revanth Reddy on Rain : వర్షాలు, వర్ష ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల పట్ల జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ మేరకు మేయర్ విజయలక్ష్మి నగరంలోని జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం డైరెక్టర్​తో టెలి కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. బంజారాహిల్స్​లో నాలా కొట్టుకుపోయిన ప్రాంతాన్ని హైదరాబాద్​ కమిషనర్​ రోనాల్డ్​ రాస్​, మేయర్​ విజయలక్ష్మి వేర్వేరుగా సందర్శించారు. నీరు నీలిచే ప్రాంతాలు, నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, వరద నీరు నీలిచే ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

rain report in telangana (ETV Bharat)

తెలంగాణ ప్రజలకు అలర్ట్​ - రాగల ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు - Telangana Weather Report Today

అలర్ట్ - అలర్ట్ - అలర్ట్ - హైదరాబాద్​కు భారీ వర్ష సూచన - అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్లకు కాల్ చేయండి - telangana weather news

Last Updated : May 16, 2024, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details