ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణుల్లో అయోమయం - ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలో అర్థంకాని పరిస్థితి - ys jagan

Prakasam District YSRCP Leaders Confused Situation: ప్రకాశం జిల్లా వైసీపీలో ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇన్​ఛార్జిల మార్పులు చేర్పులతో నాయకులు తేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఇన్​ఛార్జిల మార్పుల విషయంలో అధిష్ఠానం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం సొంత సామాజికవర్గం విషయంలో ఒకలా, ఇతరులకు మరోలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Prakasam_District_YSRCP_Leaders_Confused_Situation
Prakasam_District_YSRCP_Leaders_Confused_Situation

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 12:55 PM IST

Prakasam District YSRCP Leaders Confused Situation: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలను ప్రకటించే విషయంలో వైసీపీలో గందర గోళ పరిస్థితులు నెలకొన్నాయి. మారు మాటలాడని సిట్టంగులకు ఒక విధంగా, గట్టిగా మాట్లాడేవారికి ఒక విధంగా పార్టీ ప్రాధాన్యాల్లో మారిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. తొలి జాబితాల్లో ఎస్సీ నియోజకవర్గాల ప్రకటించారు. సంతనూతలపాడు సుధాకర బాబుకు టికెట్‌ లేదని నిరాకరించారు. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా నుంచి మేరుగ నాగార్జునను తీసుకువచ్చారు. దీంతో సుధాకర్‌ బాబు అలక వహించారు. పార్టీ కార్యక్రమాలకు , కొత్త అభ్యర్థి పరిచయ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు.

ఎర్రగొండ పాలెం నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహిస్తూ, తనకంటూ పట్టు సాధించుకున్న ఆదిమూలపు సురేష్​ను కొండెపి నియోజకవర్గానికి పంపించారు. కొండెపి పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోయినా, అయిష్టంగా వెళ్లాల్సి వచ్చింది. కొండెపిలో పలు చోట్ల పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వర్గ పోరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అశోక్‌ బాబును గుంటూరు జిల్లా వేమూరుకు పంపించారు. ఇన్నాళ్లూ నియోజకవర్గంలో పనిచేసిన వ్యక్తిని హఠాత్తుగా వేమూరు పంపడంతో అక్కడ క్యాడర్‌తో కలిసి పనిచేయడానికి ఇబ్బంది పడుతున్నారు.

రసవత్తరంగా ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయం - అధిష్ఠానం ఎత్తులకు ఆశావహుల ప్రతివ్యూహం

అన్నా రాంబాబు పోటీ చేస్తారా?: తొలిజాబితాలో మూడు ఎస్సీ నియోజకర్గాల్లో మార్పులు జరిగినా ఆయా అభ్యర్థులు తమ అభిప్రాయానికి చెప్పుకోడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. గిద్దలూరులో వర్గ పోరు కారణంగా అన్నా రాంబాబు పోటీ చేయనని ప్రకటించారు. అంతకు ముందే ఆయనకు టికెట్‌ లేదని సూచనప్రాయంగా చెప్పడంతో ఆయన తనంతట తానే పోటీ చేయనని ప్రకటించుకున్నారు. తాజాగా స్థానికులకు ఇవ్వాలని ఒక వర్గం, ఎమ్మెల్యేకే తిరిగి టికెట్ ఇవ్వాలని మరొక వర్గం సమావేశాలు పెట్టుకొని డిమాండ్లు చేస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ ఎవరికీ టికెట్‌ ప్రకటించలేదు.

కనిగిరి నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మధుసూదన్‌ యాదవ్‌ పనితీరు బాగులేదంటూ మార్పు చేస్తున్నారు. కొత్తగా నారాయణ యాదవ్‌ పేరు ప్రకటించారు. ఈ పేరు మార్పులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అద్దంకిలో ఇంతవరకూ ఇన్‌ఛార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యను కాదని హనిమరెడ్డి పేరు ప్రకటించారు. దీంతో తొలినుంచి నియోజకవర్గ బాధ్యతలను చూస్తున్న కృష్ణ చైతన్యతో పాటు, మండల స్థాయి నాయకులు సైతం కినుకు వహించారు.

బలహీన వర్గాలు రాజకీయంగా ఎదగకుండా - జగన్‌ బంతాటలో బలవుతున్న నేతలు

సీఎం సొంత సామాజిక వర్గానికి మరోలా:పలువురు ఇప్పటికే పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశంలో చేరారు. ఇక జగన్‌మోహన్‌ రెడ్డి సొంత సామాజికవర్గానికి చెందిన వారి విషయంలో పార్టీ సానుకూలంగా వ్యవహరిస్తుందనే ప్రచారం సాగుతుంది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీమీద అనేక సార్లు కినుకు వహించారు. మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి అనేక సందర్భాల్లో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు.

పార్టీలోనే కొందరు తనను రాజకీయంగా అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని, వారి సంగతి చూస్తానంటూ ప్రకటనలు కూడా చేసారు. ఒంగోలు లో పోటీ చేయాలంటే ఇళ్ల పట్టాలకోసం నిధులు మంజూరు చేయాలని పార్టీమీద ఒత్తిడి చేశారు. అభివృద్ధికి నిధులు మంజూరు చేసే విషయంలో అనేక నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపించినప్పటీకి బాలినేని డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని 180 కోట్లు నిధులు మంజూరు చేసింది.

దిగొచ్చిన జగన్: ఒకానొక సమయంలో బాలినేని పార్టీ మారుతున్నారని, ఆయనతో పాటు మరికొందరిని తీసుకువెళ్లుతున్నారని ప్రచారం సాగింది. దీంతో జగన్‌ ఒక్క మెట్టు దిగి, బాలినేని బయటకు పోకుండా ఆయన అడిగింది ఇవ్వాల్సి వచ్చింది. అంతే కాకుండా పలు నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల నియామకం విషయంలో కూడా బాలినేని ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

దర్శి విషయంలో కూడా సిట్టింగ్‌కు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డికి ప్రకటించారు. మార్కాపురం సిట్టింగ్‌ నాగార్జున రెడ్డి మీద అనేక ఆరోపణలు రావడంతో ఆయన్నే కొనసాగిస్తారా? లేదా అదే సామాజిక వర్గానికి చెందిన సంకే వెంకటరెడ్డికి అవకాశం ఇస్తారా? అనేది అనుమానాలు వ్యక్తం అవుతన్నాయి.

అనంతలో 'పెద్ద'ల బంతాట - బలవుతున్న బలహీన వర్గాల నేతలు

రోజుకొక కొత్త అభ్యర్థి పేరు: ఇక ఒంగోలు పార్లమెంట్‌ విషయానికొస్తే రోజుకొక కొత్త అభ్యర్థి పేరు వినిపిస్తుంది. సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి విషయంలో పార్టీ అంత సానుకూలంగా లేదు. ఆయన సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. అందువల్ల ఇక్కడ కొత్త అభ్యర్ధిని పెట్టేందుకు వెతుకులాట ప్రారంభిస్తోంది. రెడ్ల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను పెట్టాలని భావిస్తోంది.

పార్లమెంట్‌ సీటుకు వైసీపీలో అభ్యర్థి కరవు: అంగ, అర్థ బలాలు ఉన్న నాయకుడు ఈ జిల్లాలో లేకపోవడంతో వేరే జిల్లాల నుంచి వలస తెప్పించే పరిస్థితి కనిపిస్తోంది. తొలిత చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరు ప్రతిపాదన తీసుకువచ్చారు. తాజాగా నగిరి ఎమ్మెల్యే రోజా పేరు వినిపిస్తుంది. మాగుంటను పోటీలో ఉంచేందుకు బాలినేని శతవిధాల ప్రయత్నించినప్పటికీ , ఫలితం దక్కలేదు. మొత్తానికి ఒంగోలు పార్లమెంట్‌ సీట్‌కు వైసీపీలో అభ్యర్థి కరవవుతున్నారు. పార్టీలో నిత్యం గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలో శ్రేణులకు అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది.

వైఎస్సార్సీపీలో ఆరని అసమ్మతి - ప్రత్యేక కార్యాచరణలో పలువురు నేతలు

ABOUT THE AUTHOR

...view details