YSRCP LEADER KODALI NANI FOLLOWER ARRESTED: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కొడాలి నాని ప్రధాన అనుచరుడు, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో గుడివాడ టీడీపీ కార్యాలయం, ఆ పార్టీ నేత రావి వెంకటేశ్వరరావుపై దాడి కేసులో కాళీని కీలక సూత్రధారిగా పోలీసులు గుర్తించి అతడిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 13 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు అరెస్టై రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా కాళీని అస్సాంలో గుడివాడ పోలీసు బృందాలు పట్టుకున్నాయి.
గడ్డం గ్యాంగ్ ముసుగులో అరాచకాలు: వైఎస్సార్సీపీ హయాంలో గడ్డం గ్యాంగ్ ముసుగులో నిందితులు అరాచకాలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2022 డిసెంబర్ 25వ తేదీన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ కార్యాలయంపై పెట్రోల్ ప్యాకెట్‌లతో దాడులకు తెగబడ్డారు. ఈ విషయంపై నమోదైన కేసులో ఇప్పటి వరకు 13 మంది కాళీ అనుచరులను ఇటీవల గుడివాడ వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
అయితే ప్రధాన నిందితుడు కాళీ అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతడు ఈశాన్య రాష్ట్రమైన అస్సాం వెళ్లి అక్కడ చేపల వ్యాపారం చేస్తున్నట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. వెంటనే కాళీ కదలికలపై నిఘా ఏర్పాటు చేసి మంగళవారం అరెస్ట్ చేశారు. త్వరలోనే నిందితుడిని గుడివాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.
కొడాలి నాని అరెస్ట్ అయ్యే అవకాశం: మరోవైపు ఇదే కేసులో మాజీ మంత్రి కొడాలి నాని సైతం అరెస్ట్ అయ్యే అవకాశముంది. గతంలో అరెస్టయిన 13 మంది నిందితులను గుడివాడ పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో వారు కొడాలి నాని ఆదేశాల మేరకే దాడులకు పాల్పడ్డామని విచారణలో వెల్లడించినట్లు సమాచారం. వారి మాటల్లో వాస్తవాలు ఉన్నట్లు రుజువైతే కొడాలి నానిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముంది.
కొడాలి నాని అనుచరులకు 14 రోజుల రిమాండ్ - నెల్లూరు సబ్‌జైలుకు తరలింపు