KTR Quash Petition Hearing: ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
కాగా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై గతంలో విచారణ సందర్భంగా ఈనెల 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 27వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ తర్వాత విచారణ 31వ తేదీకి వాయిదా పడింది. తాజాగా నేడు ఇరు వైపులా వాదనలు ముగిసాయి. ఈ మేరకు కేటీఆర్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తీర్పు విడుదల చేసేంత వరకూ కేటీఆర్‌ని అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
అగ్రిమెంట్ జరగకముందే చెల్లింపులు: ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా - ఈ రేసు కేసులో అగ్రిమెంట్ జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో 46 కోట్ల రూపాయలు చెల్లించినట్లు చెప్పారు. ఈ - కార్ల రేసింగ్ సీజన్ 10 అగ్రిమెంట్‌కి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. ఈ సందర్భంగా దర్యాప్తు ఏ దశలో ఉందని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని, అన్ని ఆధారాలు బయటపడతాయని ఆయన తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలం సేకరించారని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
వాళ్లు ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా?: నిందితులు బీఎల్‌ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ వ్యవహారంలో ఎవరినీ అరెస్టు చేయలేదని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేశామని ఏజీ తెలిపారు. దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్‌రెడ్డి తన వాదనలను కోర్టుకి వినిపించారు. పురపాలక శాఖ మంత్రి ఆధ్వర్యంలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారని, ఫార్ములా ఈ రేసింగ్‌కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారని తెలిపారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టు దృష్టికి ఆయన తీసుకెళ్లారు.
కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదు: బీఆర్ఎస్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా డబ్బు చెల్లించారని ఉదయం ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతరం మాజీమంత్రి కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లు ఎఫ్‌ఐఆర్‌కు వర్తించవని, ఫార్ములా ఈ-రేసు నిర్వహణ అగ్రిమెంట్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారని దవే అన్నారు. ఆ శాఖకు మంత్రిగా ఉన్న కేటీఆర్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం తగదని, కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని కోర్టుకు తెలిపారు. అవినీతి జరిగినట్లు ఎక్కడా ఆధారాలు చూపించలేదని సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.
కేటీఆర్‌కు ఈడీ పిలుపు - విచారణకు రావాలని నోటీసులు
ఫార్ములా ఈ-కార్ రేసు కేసు - తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట