నేటితో ముగియనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచార గడువు (ETV Bharat) Telangana Graduate MLC By Election Campaign End Today :గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవాళ్టితో ప్రచారం ముగియనుండటంతో పట్టభద్రుల్ని ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానంలో గెలవాలనే లక్ష్యంతో ప్రచారం చేస్తోంది. ఖమ్మం జిల్లా ములుగు మండలం ఇంచెర్లలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి హాజరైన మంత్రి సీతక్క, తీన్మార్ మల్లన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారం పోయిన అహం తగ్గలేదు : ప్రశ్నించే గొంతు పట్టభద్రులకు ఆత్మబంధువు తీన్మార్ మల్లన్న అని మంత్రి సీతక్క అన్నారు. గత పది ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పాలనపై పోరాడిన ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. కేటీఆర్‌కు అధికారం పోయినా, అహం తగ్గలేదని మండిపడ్డారు. ప్రజాపాలన అందిస్తున్న ప్రభుత్వంపై కారు కూతలు కూస్తున్నారని సీతక్క విమర్శించారు.
రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలి : ఖమ్మం జిల్లా బారుగూడెంలో బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు, పట్టభద్రులంతా ఓటుతో గుణపాఠం చెప్పాలని కోరారు. గెలిచిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని హస్తం పార్టీ మోసం చేసిందని విమర్శించారు. ప్రశ్నించే గొంతుకైన రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.
Telangana Graduate MLC Elections 2024 : నల్గొండ జిల్లా దేవరకొండలోని పట్టభద్రుల సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు ఏందంటే పచ్చగా ఉన్న తెలంగాణలో హత్యా రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలిస్తే హస్తం పార్టీ ఇచ్చిన గ్యారంటీలపై పోరాడవచ్చని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడే రాకేశ్‌రెడ్డిని గెలిపించాలని కేటీఆర్ కోరారు.
మహబూబాబాద్‌లోని పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ హాజరయ్యారు. జూన్ 4న ఏ సర్వేలకు, ఎవరి ఊహలకు అంతు పట్టని విధంగా ఎన్నికల ఫలితాలు వస్తాయని ఈటల అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా 6 గ్యారంటీలు అమలు కాలేదని ఆరోపించారు. కేంద్రంలో హస్తం పార్టీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని స్పష్టం చేశారు. పట్టభద్రులంతా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, హనుమకొండలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న కమలం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
తారాస్థాయికి చేరిన నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నిక ప్రచారం - GRADUATE MLC BY POLL CAMPAIGN
తెలంగాణలో వచ్చిన మార్పు - బీఆర్ఎస్ నేతలను హత్య చేయడమేనా? : కేటీఆర్ - KTR in MLC By Election Campaign2024