ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

"లైసెన్సులు మాకిచ్చి పోండి - ప్రతి నెలా ముడుపులివ్వాల్సిందే"- మద్యం వ్యాపారులకు ఎమ్మెల్యేల బెదిరింపులు

లాటరీలో మద్యం షాపు దక్కిన ఆనందం లేకుండా దందా చేస్తున్న రాజకీయనాయకులు. షాప్​ ఎవరికి వచ్చనా మా వాటా మాకివ్వాల్సిందేనంటూ బెదిరింపులు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

political_leaders_threaten_wine_shop_holders_in_andhra_pradesh
political_leaders_threaten_wine_shop_holders_in_andhra_pradesh (ETV Bharat)

Political Leaders Threaten Wine Shop Holders in Andhra Pradesh : ‘మద్యం వ్యాపారం విషయంలో జోక్యం చేసుకోవొద్దని, బెదిరింపులకు పాల్పడొద్దని, అలా చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేల తీరు మారడం లేదు. ఆ నియోజకవర్గాలు తమ సామ్రాజ్యాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

‘లాటరీలో మద్యం దుకాణాల లైసెన్సులు ఎవరికొస్తే మాకేంటి? మా ఇలాకాలో మేమే వ్యాపారం నిర్వహిస్తాం. మీకు కావాలంటే ఎంతో కొంత సొమ్ము ఇస్తాం. వదిలేసి వెళ్లిపోండి’ అంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మా పరిధిలో దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలంటే 20-30 శాతం వాటా ఇవ్వాల్సిందే. అంగీకరించకపోతే ఇక్కడ వ్యాపారం ఎలా ప్రారంభిస్తారో చూస్తాం’ అంటూ ఇంకొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారు.

‘మీరేం చేసుకుంటారో మాకు అనవసరం. ప్రతి నెలా మాకు కప్పం కట్టాల్సిందే’ అంటూ ఇంకొందరు ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఇదే పరిస్థితి. ఈ నాయకుల దెబ్బకు కొంతమంది దుకాణాలు తెరవటానికి భయపడిపోతున్నారు.

ఆ నియోజకవర్గాలంటే హడల్‌ : మండలాలు, పట్టణాలు, నగరాలు యూనిట్లుగా ఈసారి మద్యం దుకాణాలను ఎక్సైజ్‌ శాఖ నోటిఫై చేసింది. ఉదాహరణకు విజయవాడలో 39 దుకాణాల్ని నోటిఫై చేశారు. లాటరీలో లైసెన్సు దక్కించుకున్న వారు నగర పరిధిలో ఎక్కడైనా దుకాణాల్ని ఏర్పాటు చేసుకోవొచ్చు. దీంతో వాటాలు, కమీషన్ల కోసం ముఖ్య నాయకుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్న నియోజకవర్గాల పరిధిలో దుకాణాలు పెట్టటానికి వ్యాపారులు ఇష్టపడట్లేదు.

"మాకేంటి!" లక్కీ లాటరీ వరించినా మాఫియా బెదిరింపులు - "దుకాణం పెట్టాలంటే ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలంట"

విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం పరిధిలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయటానికి ఎవరూ ముందుకు రావట్లేదు. లైసెన్సులు దక్కించుకున్న వారంతా తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోనే ప్రారంభిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దుకాణాలు ఏర్పాటు చేయాలంటే తమకు 30 శాతం వాటా ఇవ్వాలని స్థానిక ముఖ్య నాయకుడి అనుచరులు వ్యాపారుల్ని బెదిరిస్తున్నారు. దీంతో వారు ఇతర ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, కొన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది.

సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల్నీ వదలట్లేదు :అనంతపురం పట్టణంలో కొంతమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మద్యం దుకాణాల లైసెన్సులు లాటరీలో లభించాయి. అయితే అక్కడి స్థానిక ముఖ్య నేత వారినీ వదలట్లేదు. 20-30 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. పార్టీలతో సంబంధం లేని మరికొందరు వ్యాపారులకు లైసెన్సులు రాగా వాటిని తమకు అప్పగించేసి వెళ్లిపోవాలంటూ ముఖ్యనేత అనుచరుడు బెదిరిస్తున్నారు. అందుకు ఓ వ్యాపారి అంగీకరించకపోవటంతో విద్యుత్తునగర్‌ సర్కిల్‌లో షాపు ప్రారంభించనివ్వకుండా అడ్డుకున్నారు.

  • రాజమహేంద్రవరంలో వేరే నియోజకవర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడికి లాటరీలో మద్యం దుకాణం వచ్చింది. అయితే తన నియోజకవర్గం పరిధిలో దుకాణం ప్రారంభించాలంటే వాటా ఇవ్వాల్సిందేనంటూ అక్కడి ముఖ్య నేత ఒకరు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అమలాపురం పరిధిలో ఓ ముఖ్య నాయకుడు 20 శాతం వాటా అడుగుతున్నారు.
  • తాడిపత్రిలో ముఖ్య నాయకుడు తన బినామీలు, అనుచరులతో అన్ని దుకాణాలకు అతి తక్కువగా మూడేసి దరఖాస్తులే వేయించారు. అత్యధిక శాతం దుకాణాలు ముఖ్య నాయకుడి అనుచరులకే దక్కాయి. ఒకటి, రెండు మాత్రం వేరేవారికి లభించాయి. వారిని లైసెన్సు ఫీజు కట్టనీయకుండా అడ్డుకుని ఆ దుకాణాలను చేజిక్కించుకున్నారు.

పోలీసుస్టేషన్‌కు పిలిపించి ఒత్తిడి :నరసరావుపేటలో మద్యం దుకాణాల లైసెన్సులు దక్కించుకున్న వారిని ముఖ్య నాయకుడి ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోలీసుస్టేషన్‌కు పిలిపిస్తున్నారు. ముఖ్య నాయకుడికి 25 శాతం వాటా ఇవ్వాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు.

  • సత్తెనపల్లి నియోజకవర్గంలో మద్యం దుకాణాలు పెట్టుకోవాలంటూ ముఖ్య నాయకుడికి 30 శాతం వాటా ఇవ్వాల్సిందేనని హెచ్చరిస్తున్నారు. ఓ గుత్తేదారు దీనికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేట, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
  • తుని నియోజకవర్గంలో మద్యం దుకాణాల్ని దక్కించుకున్న వ్యాపారుల్ని స్థానిక నాయకులు బెదిరిస్తున్నారు. లైసెన్సుల్ని తమకు అప్పగించి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఎంతో కొంత వాటా ఇస్తామని వ్యాపారులు చెబుతున్నా లేదు దుకాణాల్ని తమకు అప్పగించాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు.

దుకాణం అద్దెకిస్తే బెదిరింపులు : వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరులోని తాడిపత్రి రోడ్డులో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు లైసెన్సుదారులు రూ.లక్ష అడ్వాన్సు ఇవ్వగా స్థానిక ముఖ్య నాయకుడి అనుచరులు సంబంధిత భవన యజమానిని బెదిరించారు. చివరికి అక్కడ దుకాణం ఏర్పాటు కాలేదు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మద్యం దుకాణాన్ని దక్కించుకున్న ఓ లైసెన్సీని బెదిరించి ఆ దుకాణాన్ని వదిలేయాలని హెచ్చరించారు. రాయచోటి నియోజకవర్గంలో నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సజల పేరిట రెండు మద్యం దుకాణాలు రాగా స్థానిక నేత అక్కడ వారికి అద్దెకు భవనం దొరక్కుండా చేస్తున్నారు.

నంద్యాల జిల్లా పాణ్యంలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు 30 శాతం వాటా ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యనాయకుడు ఒత్తిడి చేస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గం పరిధిలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మరో నియోజకవర్గంలో అయితే ఓ నాయకుడు ఏకంగా 70 శాతం వాటా అడగడంతో లైసెన్సుదారు బెంబేలెత్తిపోయారు.

సొమ్ములు చెల్లించి చేజిక్కించేసుకుని :తెలంగాణ సరిహద్దు జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లోని దుకాణాలకు తెలంగాణ వ్యాపారులకు దుకాణాలు దక్కాయి. స్థానిక సిండికేట్‌ ప్రతినిధులు, ముఖ్య నాయకులు వారిని బెదిరించి కొంత గుడ్‌విల్‌ చెల్లించి ఆ దుకాణాల్ని చేజిక్కించుకున్నారు.

  • విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో మద్యం దుకాణం దక్కగా అక్కడి ముఖ్య నాయకుడి అనుచరులు 50 శాతం వాటా ఇవ్వాలని బెదిరిస్తున్నారు. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో దుకాణం ఏర్పాటు చేసుకోనివ్వకుండా స్థానిక ముఖ్యనేత అనుచరులు అడ్డుకుంటున్నారు.
  • శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఒడిశాకు చెందిన కొందరు వ్యాపారులకు లైసెన్సులు వచ్చాయి. వాటిలో తనకు వాటా ఇవ్వాల్సిందేనంటూ ముఖ్యనాయకుడు ఒత్తిడి చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలోనూ ముఖ్య నాయకుడి బంధువు ఒకరు వాటాల కోసం ఒత్తిడి చేస్తున్నారు.
  • దెందులూరు నియోజకవర్గంలో రెండు మద్యం దుకాణాలు ప్రవాసాంధ్రులకు లభించాయి. అక్కడి నాయకుడి వారిద్దర్నీ భయపెట్టి, కొంత గుడ్‌విల్‌ ఇచ్చేసి ఆ దుకాణాల్ని చేజిక్కించుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముఖ్యనాయకుడికి బెదిరింపులకు భయపడి ఐదు దుకాణాలను వదులుకునేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. తిరుపతిలోనూ లైసెన్సులను దక్కించుకున్న వారిని స్థానిక నాయకుడి అనుచరులు వాటాల కోసం బెదిరిస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో నాయకుడికి 40 శాతం వాటా చెల్లించేందుకు లైసెన్సుదారు అంగీకరించి వ్యాపారం ప్రారంభించారు. రామచంద్రాపురం మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడికి మద్యం దుకాణం దక్కింది. దాన్ని తమకు అప్పగించాలంటూ నియోజకవర్గ నేత ఒత్తిడి తేవటంతో ఆయన ఎదురు తిరిగారు.

రమణా - ఆ డబ్బెక్కడ? ప్రభుత్వ మద్యం దుకాణాల్లో గోల్‌మాల్‌

ABOUT THE AUTHOR

...view details