PM Narendra Modi Tweets: పల్నాడు జిల్లా బొప్పూడిలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాగళం బహిరంగ సభపై మోదీ ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికల ప్రచార సభ తనకు సంతృప్తినిచ్చిందని మోదీ ట్వీట్ చేశారు. సభ ప్రారంభానికి ముందు చేసిన ట్వీట్లో ఎన్డీఏ కూటమిని ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సభ అనంతరం చేసిన ట్వీట్లో ఏపీలో జరిగిన సభపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. పల్నాడులో భారీ బహిరంగ సభలో తాను పాల్గొన్నానని ప్రధాని మోదీ ట్వీట్లో తెలిపారు. ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి ఓటేయాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అజెండాతో వెళ్తోన్న ఎన్డీఏకు ఏపీ ప్రజలు ఓటు వేస్తారని ఆకాక్షించారు.
పల్నాడులోని బహిరంగ సభకు వచ్చిన విశేష స్పందన చూస్తుంటే ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని తెలుస్తోందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్‌కు అభివృద్ధిని అందించగలవని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. అదే విధంగా వైఎస్సార్‌సీపీ అవినీతి, దుష్టపాలనకు మరోపేరని విమర్శించారు.
అయితే సభలో పాల్గొనడానికి ముందు కూడా మోదీ ట్వీట్ చేశారు. చిలకలూరి పేట బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్‌తో కలిసి పల్నాడు బహిరంగ సభలో పాల్గొంటున్నట్టు ట్వీట్లో పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ఏపీ ప్రజల ఆశీర్వాదం కోరుకుంటోందన్నారు. ఏపీ అభివృద్ధికి కూటమి పని చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని తెలిపారు.
ట్రెండింగ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ:మరోవైపు ప్రజాగళం సభతో టీడీపీ, జనసేన, బీజేపీ విన్నింగ్ (TDPJSPBJPWinning) అనే హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అదే విధంగా ఏపీ వెల్కమ్స్ నరేంద్ర మోదీ (APWelcomesNamo) అనే హ్యాష్ ట్యాగ్, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు కూడా ట్రెండ్ అవుతోంది.