తెలంగాణ

telangana

ETV Bharat / politics

బీఆర్​ఎస్​ను దింపడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది - కాంగ్రెస్ విషయంలో అంత సమయం పట్టదు : ప్రధాని మోదీ - PM Modi Interview 2024 - PM MODI INTERVIEW 2024

PM Modi Interview : హైదరాబాద్‌ దేశానికే గ్రోత్‌ సెంటర్‌ అని అభివర్ణించిన ప్రధాని మోదీ మహానగరం అభివృద్ధికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. భాగ్యనగరాన్ని అన్ని వైపులా స్పీడ్‌ కారిడార్లతో అనుసంధానం చేయడానికి పనిచేస్తున్నామన్నారు. వందే భారత్‌ మెట్రో, హైస్పీడ్‌ రైలు ప్రయోజనాన్ని హైదరాబాద్‌ అందుకోబోతోందని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పాలనకు తేడా ఏమీ లేదని డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో పరువు తీస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్​ను దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టిందని కాంగ్రెస్‌ను దించడానికి అంత సమయం పట్టదని ఈనాడు ముఖాముఖిలో ప్రధాని వ్యాఖ్యానించారు.

PM Modi Interview 2024
PM Modi Eenadu;ETV Bharat Interview (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 5, 2024, 7:10 AM IST

  • PM Modi Interview 2024 : ఈ ఎన్నికల్లో మీరు బీజేపీకి 370కిపైగా, ఎన్డీయేకు 400కుపైగా సీట్ల లక్ష్యం విధించుకున్నారు. దీని వెనకున్న లక్ష్యమేంటి?

370 సీట్లన్నది కేవలం ఎన్నికల నినాదం కాదు. అది ప్రజాభిప్రాయం. మోదీ గ్యారంటీలను అమలు చేస్తారని మాపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసానికి నిదర్శనం. ఆర్టికల్‌ 370 రద్దు అన్నది కోట్ల మంది ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. ఆర్టికల్‌ 370 రద్దు చేసిన పార్టీకి 370కిపైగా సీట్లు, కూటమికి 400కుపైగా సీట్లు ఇవ్వాలన్న సహజ సిద్ధమైన భావోద్వేగం వారిలో కలిగింది. ఈ నినాదం వెనుకున్న అసలు విషయం ఇది. మన రాజ్యాంగాన్ని కాపాడటానికి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రక్షించడానికి మాకు 400 సీట్లు అవసరం.

  • ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మీవద్ద ఉన్న ప్రణాళికలేంటి? మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంలో?

తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలకు చారిత్రకంగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత సాయి కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ఇప్పటికే ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని మాదిగ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపింది.

గోద్రా అల్లర్లపై మోదీ కీలక వ్యాఖ్యలు- మూడో విడత వేళ ప్రతిపక్షాలపై ఫుల్​ ఫైర్​! - lok sabha election 2024

  • విభజన వేళ పార్లమెంటు సాక్షిగా ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏమైనా మార్గ సూచిక ఉందా?

జవాబు: నాటి హామీల అమలుకు మేం చిత్తశుద్ధితో పని చేశాం. ఏకాభిప్రాయ సాధనతో ద్వైపాక్షిక సమస్యల సామరస్య పరిష్కారానికి మా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా 2014 నుంచి ఇప్పటి వరకు 33 సమీక్షా సమావేశాలను నిర్వహించాం. అయితే రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేక 89 సంస్థలు/కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సులతో తెలుగు రాష్ట్రాలకు వేల కోట్ల గ్రాంటు ఇచ్చాం. వనరుల లోటు భర్తీ, 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విదేశీ సాయం కింద చేపట్టిన ప్రాజెక్టుల రుణాలపై వడ్డీ కోసం ఏపీకి రూ.35వేల కోట్లకుపైగా విడుదల చేశాం.

జాతీయస్థాయి విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశాం. ఏపీని పెద్ద పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కసరత్తు చేస్తున్నాం. వైజాగ్‌, చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ను దిల్లీ-ముంబయి పారిశ్రామిక కారిడార్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్నాం. తెలంగాణలోని ములుగులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. కాజీపేటకు రైల్వే వ్యాగన్ల తయారీ యూనిట్‌ మంజూరు చేశాం. 9 ఉమ్మడి జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక సాయం కింద రూ.2,250 కోట్లు విడుదల చేశాం.

  • తెలంగాణ నుంచి కేంద్రానికి భారీగా పన్ను ఆదాయం వస్తున్నా తగినంత నిధులు ఇవ్వడంలేదనే విమర్శలకు మీ సమాధానమేంటి?

నిజాలు తెలిసి ప్రతిపక్షాలు పదేపదే పదే ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం. వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకు ఇలా చేస్తున్నాయి. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను ఏకంగా 32శాతం నుంచి 42శాతానికి పెంచింది. ఆ సిఫార్సులను పూర్తిగా అమలు చేశాం. రాష్ట్రాలకు వాటా భారీగా పెరిగింది. మూలధన వ్యయం కోసం సాయం చేశాం. తెలంగాణకు రూ.1,156 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.2,226 కోట్లు ఇచ్చాం. మా హయాంలో రెండు రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర సాయం గతంలో కంటే భారీగా పెరిగింది.

  • పసుపు బోర్డు ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినా ఆ తర్వాత చర్యలేమీ చేపట్టలేదు. ఏదైనా ముందడుగు ఆశించొచ్చా?

ప్రధాన కార్యాలయం ఖరారు దగ్గరి నుంచి అధికారుల గుర్తింపు వరకూ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నికల కోడ్‌ వల్ల కొంత ప్రభావం పడింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి 100 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాం. దేశంలో పసుపు రంగానికి ప్రోత్సాహం, అభివృద్ధికి ఈబోర్డు దోహదం చేస్తుంది.

  • హైదరాబాద్‌కు కేంద్రం ఎలాంటి సాయం చేయబోతోంది. హైదరాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదన సాకారానికి చర్యలు తీసుకుంటారా..?

తెలంగాణకు, భారతదేశానికి హైదరాబాద్‌ ఒక గ్రోత్‌ సెంటర్‌. అక్కడ రద్దీని నివారించడానికి పని చేస్తున్నాం. 6 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌ను అన్ని వైపులా స్పీడ్‌ కారిడార్లతో అనుసంధానం చేయడానికి పని చేస్తున్నాం. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలకు ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ ఒక జీవనాధారం. ఎంఎంటీఎస్‌ నెట్‌వర్క్‌ను విస్తరిస్తాం. వందే భారత్‌ మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్‌ కూడా ఇందులో ప్రయోజనం పొందబోతోంది.

ముంబయి, అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ వంటి కారిడార్లను దేశ నలుమూలల నిర్మిస్తామని మేనిఫెస్టోలో చెప్పాం. రైల్వేశాఖ ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది. దక్షిణాదిలో హైదరాబాద్‌ ముఖ్య నగరం కాబట్టి భవిష్యత్తులో హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ను కచ్చితంగా చూస్తుంది. అమృత్‌ స్కీం, స్వచ్ఛ భారత్‌ మిషన్, మెట్రో రైలు నిర్మాణం, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజనలాంటి పథకాల ద్వారా హైదరాబాద్‌ లబ్ధి పొందింది.

  • తెలంగాణ అభివృద్ధికి కేంద్రం తగిన సాయం చేయడం లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. దీనిపై మీ జవాబేంటి?

మా ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలా మద్దతు ఇచ్చింది. ఇక ముందూ కొనసాగిస్తుంది. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు బ్రేకులు వేశాయి. వైఫల్యాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జవాబు చెప్పలేక కేంద్రంపై నిందలు మోపుతున్నాయి. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనవారు. ఎయిమ్స్‌ బీబీనగర్, కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం, సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌ ఐఐటీలో మౌలిక వసతుల బలోపేతం, కాజీపేట తయారీ యూనిట్, రామగుండంలో ఎరువుల కర్మాగారం, ఎన్‌టీపీసీ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు, వరంగల్‌లో పీఎం మిత్ర పార్కు ఇచ్చింది కేంద్రమేనని తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించిన ఘనత కేంద్రానిదేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు.

  • గత పదేళ్ల బీఆర్ఎస్ , ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనల మధ్య ఏమైనా తేడా గుర్తించారా?

ఇది చాలా మంచి ప్రశ్న. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడాను తెలంగాణ ప్రజలూ గుర్తించలేకపోతున్నారు. ఒకే నాణేనికున్న రెండు పార్శ్వాలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌. రెండు ప్రభుత్వాలు కొండంత హామీలిచ్చాయి. కానీ గోరంత చేశాయి. చేస్తున్నాయి. ఆ రెండూ తెలంగాణను ఏటీఎంలుగా ఉపయోగించుకుంటున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి సూపర్‌హిట్‌ సినిమాను ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా దేశానికి మంచిపేరు తెస్తే ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ పరువు తీసుతోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో కాంగ్రెస్, బీఆర్ఎస్​లు రెండూ భాగస్వాములే. బీఆర్ఎస్​ను ఇంటికి పంపడానికి ప్రజలు పదేళ్లు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని సాగనంపడానికి వారికి ఎక్కువ సమయం పట్టదు.

తెలంగాణలో బీజేపీ అగ్రనేత ప్రచారం - ఈనెల 8,10 తేదీల్లో ప్రధాని రాక - BJP ELECTION CAMPAIGN IN TELANGANA

బెంగళూరు కేఫ్​లో బాంబు పేలలేదు- కాంగ్రెస్ మైండ్ పేలింది: మోదీ - PM Modi Attack On Congress

ABOUT THE AUTHOR

...view details