Pinnelli Victim Petition in Supreme Court: పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో శేషగిరిరావు పిటిషన్ వేశారు. పిన్నెల్లికి హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. కౌంటింగ్ రోజు కూడా హింసకు పాల్పడే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అదే విధంగా ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై మరో పిటిషన్‌ను సైతం శేషగిరిరావు దాఖలు చేశారు. ఆధారాలున్నా ఎమ్మెల్యే పేరు, అనుచరుల పేర్లు లేకుండా కేసు పెట్టారని నంబూరి శేషగిరిరావు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించారని అన్నారు.
అయితే ఈ అంశాలన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందన్న శేషగిరిరావు, తీవ్ర ఘటనలైనా బెయిల్ మంజూరు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షాలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్న శేషగిరిరావు, పిన్నెల్లి లేకున్నా ఆయన ఏజెంట్ కౌంటింగ్ పరిశీలించే అవకాశం ఉందని అన్నారు. పిన్నెల్లి కౌంటింగ్ వద్ద ఉంటే మళ్లీ హింస జరిగే ప్రమాదం ఉందని శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు. శేషగిరిరావు దాఖలు చేసిన 2 పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
'మీ ధైర్యం నచ్చింది- పార్టీ మీకు అండగా ఉంటుంది' - శేషగిరిరావుకు చంద్రబాబు ఫోన్ - Chandrababu called Seshagiri Rao
Pinnelli EVM Destroy Incident: కాగా ఎన్నికల రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో నంబూరి శేషగిరిరావు గాయపడ్డారు. పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన శేషగిరిరావుపై పిన్నెల్లి వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే సిట్ విచారణలో పిన్నెల్లిపై కేసు నమోదుతో అజ్ఞాతం వీడి బయటకు వచ్చి దాడి ఘటన వివరాలను వెల్లడించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు పిన్నెల్లి నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.
పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఏజెంట్‌గా ఉన్న తరుణంలో ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో దూసుకు వచ్చి స్వయంగా ఈవీఎం పగలగొట్టిన విషయం తెలిసిందే. పిన్నెల్లి చర్యలకు ఎన్నికల సిబ్బంది, ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనను అరెస్టు చేయాలంటూ ఆదేశించింది. అయితే ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయొద్దంటూ ఆదేశించింది. అదే విధంగా మాచర్ల హింసలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లోనూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. తాజాగా హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దుచేయాలంటూ పిన్నెల్లి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
పిన్నెల్లి రోజూ హాజరు కావాల్సిందే- షరతులు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : హైకోర్టు - PINNELLI BAIL