Peddireddy Land Grabs :మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జులై 21న జరిగిన దస్త్రాల దహనం ఘటన తర్వాత ప్రభుత్వం భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేరిట ఉన్న భూముల వివరాలు సేకరిస్తోంది. వెబ్‌ల్యాండ్ రికార్డుల ప్రకారం చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, కుటుంబసభ్యుల పేరిట వివిధ సర్వే నంబర్లు, సబ్‌డివిజన్‌ల వారీగా ఉన్న భూముల వివరాలు సేకరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 41 ఎకరాలు, మిథున్‌రెడ్డి పేరిట 23 ఎకరాలు, పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 171 ఎకరాల భూమి ఉంది.
పెద్దిరెడ్డి కుటుంబం ఆధీనంలో వందల ఎకరాలు : పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, పులిచెర్ల మండలం మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామాల్లో ఈ భూములు ఉన్నాయి. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం మెట్ట భూములు 54 ఎకరాలు, మాగాణి 27 ఎకరాలకు మించి ఒక కుటుంబం వద్ద ఉండకూడదు. అయితే పెద్దిరెడ్డి కుటుంబం అజమాయిషీలో వందలాది ఎకరాల భూములు ఉన్నందున ఇవి చట్ట పరిధిలోనికి వస్తుందా? రాదా? అన్న దానిపై చిత్తూరు జిల్లా అధికారులు పరిశీలన చేస్తున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించకపోవడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
Peddireddy Land Irregularities :పుంగనూరు మండలం రాగానిపల్లెలో అక్రమంగా క్రమబద్ధీకరించిన 882 ఎకరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనుచరుల వాటానే దాదాపు 600 ఎకరాలని అంచనా. ఇందులో అధిక భాగం గత ఐదేళ్లలో ఆయన పరమైనట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి తమ్ముడు, అనుచరుల పేర్లతో వందల ఎకరాలున్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పారిశ్రామికవాడ వికృతమాల గ్రామంలో పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరిట 27.7 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఇందులో 7.6 ఎకరాలు మాత్రమే కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మిగతావన్నీ 2004-07 మధ్య అసైన్డ్ చేసినవే.