Police Questioned Allu Arjun in Chikkadpally Police Station About Sandhya Theatre Incident : హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ-11గా ఉన్న అల్లు అర్జున్‌ను మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు పిలిచి మూడు గంటలకు పైగా విచారించారు. వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసినట్లు వారు తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించారు.
సీసీఎస్ డీసీపీ శ్వేత, మధ్య మండలం డీసీపీ అక్షాంశ్ యాదవ్, అదనపు డీసీపీ ఆనంద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఈ విచారణను పర్యవేక్షించింది. పోలీసులు అల్లు అర్జున్ స్టేషన్‌కు వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరేవరకు పటిష్ఠమైన భద్రత కల్పించారు. తొక్కిసలాటకు ముందు, తర్వాత చోటుచేసుకున్న సంఘటనలు, అనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్‌కు 20కి పైగా ప్రశ్నలు సంధించినట్లు తెలిపారు.
అవసరమైతే మరోసారి స్టేషన్‌కు రావాల్సి ఉంటుందని చెప్పగా, విచారణకు పూర్తిగా సహకరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు. పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో సినీ నటుల ర్యాలీకి అనుమతి ఇవ్వలేదనే విషయం మీకు తెలియదా? అని ప్రశ్నించగా దానికి బదులుగా అల్లు అర్జులు థియేటర్ యాజమాన్యం ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని బదులిచ్చినట్లు సమాచారం. దాదాపు 40 నుంచి 50 మంది బౌన్సర్లతో వచ్చి ప్రేక్షకులను నెట్టుకుంటూ లోపలకు ప్రవేశించటమే తొక్కిసలాటకు కారణమైందంటూ పోలీసులు సంబంధిత వీడియోలను ఆయనకు చూపారు. బౌన్సర్ల గురించి సమాచారం ఇవ్వాలని సూచించారు.
తొక్కిసలాటలో మహిళ మృతి చెందటం సహా బాలుడు గాయపడినట్టు పోలీసు అధికారులు అల్లు అర్జున్‌కు సమాచారం ఇచ్చి బయటకు వెళ్లమని సూచించినా తిరస్కరించటంపై నాలుగు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. రేవతి మరణించిన విషయం తనకు ఎవరూ చెప్పలేదంటూ అర్జున్ ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైనట్టు సమాచారం. ప్రీమియర్ షోకు తాము హాజరయ్యేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. విచారణ సమయంలో అర్జున్ మధ్యాహ్నం ఒకసారి బయటి నుంచి టీ తెప్పిస్తే తాగారు. 10 నుంచి 15 నిమిషాల విరామం తరువాత మరోసారి పోలీసుల ఎదుటకు వచ్చారు.
'అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలే - రూ.10 లక్షల డీడీలు మాత్రమే పంపారు'
ఒంటరిగానే విచారణ గదిలోకి : అభిమానులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో చిక్కడపల్లి స్టేషన్ వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. ఉదయం నుంచే ఆ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. 11గంటల 10 నిమిషాల సమయంలో అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ మొదటి అంతస్తులో ఉన్న ఇన్‌స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆయనతోపాటు వచ్చిన వారిని పోలీసులు పక్కకు పంపించి అర్జున్‌ను ఒంటరిగానే విచారించారు. డీసీపీ అక్షాంశ్ యాదవ్, చిక్కడపల్లి ఏసీపీ రమేష్‌కుమార్, సీఐ రాజు నాయక్ విచారణలో పాల్గొన్నారు. థియేటర్ దగ్గర తొక్కిసలాటకు బౌన్సర్ల అత్యుత్సాహమే ప్రధాన కారణమని ఆరోపణలొచ్చిన నేపథ్యంలో మంగళవారం అర్జున్ వెంట బౌన్సర్లు ఎవరూ రాలేదు.
పరదాలు కట్టారు- తొలగించారు : అల్లు అర్జున్ నివాసం వద్ద ఇటీవల ఓయూ ఐకాస నిరసన నేపథ్యంలో ఆ ఇంటి ప్రహారీ చుట్టూ పరదాలు కట్టారు. ఈ విషయం మీడియాలో చక్కర్లు కొట్టడంతో కొద్దిసేపటి తరువాత వాటిని తొలగించారు. కొద్ది రోజులపాటు అతని నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు.
విచారణకు తండ్రితో కలిసి వచ్చారు : సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట అల్లు అర్జున్ రావడం వల్లే జరిగిందని పేర్కొంటూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయగా, న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు సోమవారం అల్లు అర్జున్‌కు నోటీసులు జారీ చేశారు. వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు అవసరమైతే సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు థియేటర్‌కు కూడా వెళ్లాల్సి ఉంటుందని నోటీసులలో పేర్కొన్నారు. ఆదివారం అల్లు అర్జున్ ఇంటి వద్ద కొందరు కుండీలు పగలగొట్టి విధ్వంసానికి పాల్పడటంతో అప్పటి నుంచీ అక్కడ పోలీసు భద్రత పెంచారు.
మంగళవారం ఉదయం భార్య స్నేహారెడ్డి, పిల్లలతో అల్లు అర్జున్ కొద్దిసేపు మాట్లాడాక 10.40 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి నుంచి పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరారు. ఆయనతో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్‌రెడ్డి, నిర్మాత బన్నీ వాసు, న్యాయవాది అశోక్‌రెడ్డి స్టేషన్‌కు వచ్చారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ సుధీంద్ర, బంజారాహిల్స్ ఏసీపీ సామల వెంకటరెడ్డి బృందం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అర్జున్ నివాసం వైపు ఎవరూ రాకుండా బారికేడ్లు పెట్టారు. అర్జున్ ప్రయాణించే వాహనానికి ముందు, వెనుక ప్రత్యేక పోలీసు వాహనాలతో భద్రత కల్పించారు. ముందు జాగ్రత్త చర్యగా మరింత మంది పోలీసులను మోహరించి, అభిమానులు అక్కడ గుమిగూడకుండా తరిమేశారు. దారి వెంట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు గస్తీ వాహనాలు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్‌పై కేసును వెనక్కి తీసుకుంటాను: శ్రీ తేజ్ తండ్రి భాస్కర్