రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ (ETV Bharat) Peacefully Completed Polling in Telangana :మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో 55 శాతం పోలింగ్ నమోదైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 49.6శాతం పోలింగ్ నమోదు కాగా ఈ సారి అంతకు మించింది. ఎల్బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ వద్ద పార్టీ అనుకూల నినాదాలు చేశారని ఎన్నికల నిర్వహణ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిపై కేసులు నమోదయ్యాయి. నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన 3వేల 228 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలకు ఏజెంట్ల సమక్షంలో సీలు వేసి భారీ భద్రత నడుమ స్ట్రాంగ్‌రూంలకు తరలించారు.
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రిటర్నింగ్ అధికారి శశాంక పర్యవేక్షణలో సెగ్మెంట్ పరిధిలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, పరిగి వికారాబాద్, తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో 2వేల 877 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మహేశ్వరం 51.70శాతం, రాజేంద్రనగర్ 53.13, శేరిలింగంపల్లి 43.11, చేవెళ్ల 70.84శాతం, పరిగి 65.98, వికారాబాద్ 64.44శాతం, తాండూర్ 66.34శాతం నమోదైంది.
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ - ఓటింగ్ శాతం ఎంతంటే? - TS LOk sabha Polls 2024 Ended
Polling in Warangal :ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు స్ధానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ 60 శాతం పైన పోలింగ్ నమోదైంది. వరంగల్, భూపాలపల్లి, నియోజకవర్గాల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించి అధికారులకు చెమటలు పట్టించాయి. జనగామ జిల్లా ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 263 బూత్ వద్ద ఉద్రిక్త పరిస్ధితిలు చోటు చేసుకోగా పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మహబూబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వేములతండాలో ఓటు వేసి దానిని వాట్సప్‌లో వైరల్ చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
Peaceful Polling Across Telangana :ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజక వర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండు నియోజక వర్గాల్లోనూ పోలింగ్ 68 నుంచి 70శాతం మధ్య నమోదైంది. మహబూబ్‌నగర్‌లో సుమారు 70శాతం, నాగర్‌కర్నూల్‌లో సుమారు 69శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా మైలారం, మహబూబ్‌నగర్ పట్టణం ఎదిర గ్రామస్థులు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఓటర్లపై తేనెటీగల దాడి : కొల్లాపూర్ మండలం అమరగిరిలో చెంచులు పోలింగ్‌కు రాకపోవటంతో అధికారులు నచ్చజెప్పి తీసుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచర్ల తండావాసులు ధర్నాకు దిగగా అధికారుల హామీతో ధర్నాను విరమించి ఓటింగ్‌లో పాల్గొన్నారు. 6 గంటల్లోపు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించిన అధికారులు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను మహబూబ్‌నగర్‌లో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంకు, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూంలకు తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామంలో ఓటర్లపై తేనెటీగలు దాడిచేశాయి.
ఎన్నికల సిబ్బందిపై లాఠీఛార్జ్ :మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 73.63 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. నారాయణఖేడ్‌లో ఎన్నికల సిబ్బందిపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఎన్నికల విధుల్లో తమకు రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారంటూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగగా పోలీసు బలగాలు, ఉపాధ్యాయుల మధ్య తోపులాట జరిగింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటతండాలో వంద శాతం పోలింగ్ నమోదైంది. తండాలో 210 మంది ఓటర్లుండగా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తండావాసులను, అధికారులను కలెక్టర్ రాహుల్‌రాజ్ అభినందించారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో 73.58 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో 240 బూత్‌లో వీవీప్యాట్ మొరాయించింది. రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని 76 బూత్‌లో ఈవీఎంకు ఇంకు అంటడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు.
లోక్‌సభ నాలుగో దశ ఎన్నికలు- ఓటింగ్ శాతం ఎంతంటే? - LOK SABHA POLLS 2024
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 72.33 శాతం పోలింగ్ నమోదైంది. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కళాశాలకు తరలించారు. 215 రూట్లలో 216 సెక్టార్ ఆఫీసర్లను నియమించి జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా బ్యాలెట్ యూనిట్లను తరలించారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఏర్పాటుచేసిన 1850 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు మంథని జేఎన్‌టీయూ కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోని మంథని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు.
ఎన్నికలను బహిష్కరించిన ఓటర్లు :చెదురు మదురు ఘటనలు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లలో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ కొద్ది సేపు నిలిచిపోవడం మినహా నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. నియోజకవర్గంలో 71.47 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. బోధన్ పట్టణంలో బీజేపీ కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా ఎంపీ అర్వింద్ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రాంసాగర్ తండా, కామారెడ్డి జిల్లా మహ్మద్‌నగర్ మండలం పిప్రియాల్ గ్రామస్థులు అభివృద్ధి కోసం పోలింగ్ బహిష్కరించగా అధికారులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం తర్వాత ఓటేశారు.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో 68.37శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో సాయంత్రం 5గంటల వరకే 67.96శాతం పోలింగ్ నమోదైంది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో రెండు చేతులు లేని దివ్యాంగ యువకుడు అజ్మీరా రవి ఓటు వేయగా అతని కాలి వెలికి ఎన్నికల సిబ్బంది సిరా వేశారు. మోపాల్ మండలంలోని బైరాపూర్ పోలింగ్ బూత్ కేంద్రం వద్ద బీజేపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయనిని కాంగ్రెస్ నాయకుల గొడవకు దిగడంతో తోపులాట జరిగింది. జగిత్యాల జిల్లాలో ఇంట్లో తల్లి చనిపోయిన బాధలోనూ ఓ కొడుకు, అతని భార్య ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకుని స్ఫూర్తినింపారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం - lok sabha elections 2024
విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి మృతి : సార్వత్రిక సమరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరోసారి చైతన్యం చాటింది. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా మేము సైతం అంటూ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓటర్లు కదిలివచ్చి ఓటుకు పోటెత్తారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళి పూర్తి భిన్నంగా సాగింది. ఉభయ జిల్లాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఓట్లు బహిష్కరించడం, మరికొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపుల వంటి సమస్యలు తలెత్తాయి. ఇల్లందు జేబీఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లపై తేనెటీగలు దాడి చేశాయి. అశ్వారావుపేట నెహ్రూనగర్ 165 పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి శ్రీకృష్ణ గుండెపోటుతో మృతిచెందడం విషాదం నింపింది.
ఓటర్ల అసహనం :ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది . ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకు 73.95 శాతం, భువనగిరిలో 72.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఆందోళనలు , కొన్నిచోట్ల ఈవీఎం మొరాయింపులు మినహా రెండు లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగింది. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని అనంతగిరి మండలం వెంకటరాంపురం గ్రామంలో, మోతే మండలం నామవరంలో ఈవీఎంలు మోరాయించడంతో పోలింగ్‌కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మోటకొండూరు మండలం చందపల్లి గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరి చేసేంతవరకు గంటసేపు క్యూలైన్లో నిలబడి కొందరు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.
పోలింగ్ వేళ 38 కేసులు నమోదు - తుది ఓటింగ్ శాతంపై రేపటికి స్పష్టత : వికాస్‌రాజ్ - CEO Vikas Raj On Lok sabha Polls