Pawan Kalyan Varahi Declaration: తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలు పవన్ వివరించారు. ఈరోజు వారాహి సభ ప్రత్యేకమైనదని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిందని, ఈ 100 రోజుల్లో ఎప్పుడూ బయటకు రాలేదని తెలిపారు. ప్రజలకు ఇచ్చి హామీలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచించామన్నారు. ఆంధ్రప్రదేశ్ బలం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని, ఏడుకొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ధ్వజమెత్తారు. అన్ని ఓట్ల కోసమే చేయమని అన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని అనుకోలేదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు.
వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చా:తనకు అన్యాయం జరిగితే బయటకు రాలేదని, తిరుమలలో అపచారం జరుగుతుంది సరిదిద్దుకొండి అని గతంలో చెప్పానన్నారు. తిరుమలలో కల్తీ ప్రసాదాలు పెట్టారని మండిపడ్డారు. ఇది ఎన్నికల సమయం కాదని, సినిమా సమయం కాదని, ఇది భగవంతుడి సమయమని స్పష్టం చేశారు. ఇతర మతాలను చూసి నేర్చుకోవాలన్న పవన్, హైందవ ధర్మానానికి మనం గౌరవం ఇవ్వట్లేదని అన్నారు. మీతో జైజైలు కొట్టించుకోవడానికి రాలేదని, మీతో గొడవ పెట్టుకోవడానికి వచ్చానన్నారు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని ఎవరు అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికి వచ్చానని తేల్చి చెప్పారు. ఒక డిప్యూటీ సీఎంగానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడికి రాలేదన్న పవన్, హిందువుగా, భారతీయుడిగా ఇక్కడికి వచ్చానని తెలిపారు.
వారాహి డిక్లరేషన్: సనాతన ధర్మ పరిరక్షణకు ఒక బలమైన చట్టం అవసరం. దేశమంతా అమలయ్యేలా వెంటనే ఒక చట్టం తేవాలి. చట్టం అమలుకు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ఏటా నిధులు కేటాయించాలి. ప్రసాదాల్లో వాడే వస్తువుల నాణ్యతను ధ్రువీకరించే విధానం తేవాలి. మన దేవాలయాలు విద్య, కళలు, ఆర్థిక కేంద్రాలుగా విలసిల్లాయి. మన ఆలయాలు పర్యావరణ పరిరక్షణ, సంక్షేమ కేంద్రాలుగా మారాలని పవన్ తెలిపారు.
హిందువుగా సనాతన ధర్మాన్ని తాను ఆరాధిస్తానని, మిగతా మతాలను గౌరవిస్తానని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం చూపేది, ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని పవన్ తెలిపారు. సనాతన ధర్మం మనుషులు ఒక్కరే సుఖంగా ఉండాలని మాత్రమే కోరుకోలేదని, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి సుఖంగా ఉండాలని కోరుకుంటుందని వెల్లడించారు. ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు అని, కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి పేర్కొన్నారు.
వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా: తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేలన చేసి మాట్లాడారని, తన ప్రాయశ్చిత్త దీక్షను కూడా అవహేలన చేశారని అన్నారు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటానన్న పవన్, ఇనాళ్లు తాను ధర్మం పట్టుకుని నిలబడ్డానన్నారు. నమాజ్ వినిపిస్తే తన ప్రసంగాన్ని ఆపేసేవాడినని గుర్తు చేశారు. పరాభవం పొందినా, పరాజయం పొందినా తాను ఒకేలా ఉంటానన్నారు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అంటున్నారని, ఈ మధ్య కాలంలో దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయని అన్నారు. రాముడిని తిడితే నోరెత్తకూడదని, మనది సెక్యులర్ దేశం అంటారని, ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా అని ప్రశ్నించారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదా అని నిలదీశారు.
హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది:సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారన్న పవన్, సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించేవారు ఎక్కువయ్యారని, ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవని ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరని, మనం పళ్ల బిగువున బాధను భరించాలా అని ధ్వజమెత్తారు. మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణమన్న పవన్, హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారన్నారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చిందన్న పవన్, మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదని, మెకాలే తీసుకువచ్చిన వివక్ష ఇదంతా అని పేర్కొన్నారు.