Pawan Kalyan Speech at Janasena Party Formation Day :టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో కలిసి సీఎం జగన్ తోకను కత్తిరించబోతున్నామని, అధికారంలోకి వచ్చాక ప్రతినెలా జనవాణి నిర్వహిస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ పోతున్నారని, వైఎస్సార్సీపీ కూడా పోతుందని స్పషం చేశారు. అధికార పార్టీ రౌడీమూకలకు జనసేన శక్తిని చూపిస్తామని, ఏపీని చీకటి నుంచి వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమం కత్తిలాంటిదని తెలిపారు. తెల్ల పేపర్‌పై శ్రీశ్రీ రాస్తే కవిత్వం అవుతుందని, జగన్ రాస్తే బూతు అవుతుందని ఎద్దేవా చేశారు. ముస్లింలు మైనార్టీలు కాదని, తన గుండెల్లో ముస్లింలు మెజార్టీలేనని అన్నారు.
అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్లిపోతే ప్రతి ఆటో డ్రైవర్, ప్రతి మహిళ శ్రీలంక అధ్యక్షుడి భవనాన్ని ఎలా వాడుకున్నారో తాడేపల్లి ప్యాలెస్‌ను కూడా అలాగే వాడుకుంటారని అన్నారు. శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతి ఒక ముఖ్యమంత్రికి జరగదని గ్యారంటీ ఏంటి, జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో చూశారని గుర్తు చేశారు. ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరని పవన్ అన్నారు.
పిఠాపురం నుంచి బరిలో పవన్‌కల్యాణ్ - స్వయంగా వెల్లడించిన జనసేనాని
అధికారం కోసం కాదని, మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు. 150 మందితో జనసేనను ప్రారంభించామని, నేడు 6.50 లక్షల మంది క్రియాశీలక కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. కామన్‌మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆరోజు అండగా ఉన్న వ్యక్తులు ఇవాళ జనసేనకు మూలస్తంభాలయ్యారని తెలిపారు. ఒక ఆశయం కోసం వచ్చిన వాణ్ని, ఓడిపోతే శూన్యమనిపించింది. అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చానని, ఇంకెవరూ బతక్కూడదు, తమ గుంపే బతకాలనుకుంటే కుదరదని అన్నారు. వైఎస్సార్సీపీ, జగన్‌పై తనకు వ్యక్తిగతంగా ద్వేషం లేదని, కానీ, తమని తొక్కేస్తామంటే తాము తొక్కేస్తామని హెచ్చరించారు.