వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతాం: పవన్ కల్యాణ్ Pawan Kalyan Serious Comments on Jagan: వచ్చే ఎన్నికలకు మహా యుద్ధం ప్రకటిస్తున్నా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక దాష్టికుడ్ని ఓడించి విధ్వంసకర పాలన ఆపేందుకు శంఖారావం పూరిస్తున్నామన్నారు. తెలుగుదేశం - జనసేన వర్ధిల్లుతూ బీజేపీ కలసి రావాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. పొత్తు గెలవాలి - వైఎస్సార్సీపీ పోవాలని పిలుపునిచ్చారు. హలో ఏపీ బై బై వైసీపీ ఇది అందరి నినాదం కావాలని సూచించారు.
జగనే పెళ్లాంగా రావొచ్చు :పవన్ కల్యాణ్‌తో స్నేహం చచ్చేదాక ఉంటుందని వెల్లడించారు. పవన్ కల్యాణ్‌తో శతృత్వం అవతలి వాళ్లు చచ్చేదాక పోదన్నారు. తనకు నాలుగో పెళ్ళాం జగనేనేమో అని విమర్శించారు. లేని నాలుగో పెళ్ళాం గురించి మాట్లాడే బదులు జగనే పెళ్లాంగా రావొచ్చుగా అని ఎద్దేవా చేసారు. జగన్ కి సంబంధించిన వరకు తనవి 3పెళ్లిల్లు 2 విడాకులు, కానీ పవన్ కళ్యాణ్ అంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అని తెలిపారు. తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదు, యుద్ధం చేసే వాళ్లు కావాలని పవన్ కల్యాణ్ అన్నారు. ఓట్లు తీసుకువచ్చేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారని, యుద్ధం చేస్తేనే జగన్ కూలిపోతారని పేర్కొన్నారు. ప్రజల నాడి తెలియకుండా దశాబ్దం పాటు పార్టీని నడపగలమా? అంటూ పవన్ ప్రశ్నించారు. ఏమీ చేయకున్నా జగన్‌ను పొగిడే సమూహం ఆయనకు ఉందని, నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తోందంటూ ప్రశ్నించారు.
టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్ - వైఎస్సార్సీపీ చీటింగ్ టీమ్: చంద్రబాబు
నెత్తిన కాలుపెట్టి తొక్కితే :తనను ప్రశ్నించే వాళ్లు తనతో నిలబడడం నేర్చుకోవాలని పవన్ సూచించారు. తాను కేవలం ఒక ప్రాంత వ్యక్తిని కాదని ఓడినా, గెలిచినా మీతో ఉంటానని పేర్కొన్నారు. బలి చక్రవర్తి కూడా వామనున్ని చూసి ఇంతేనా అన్నారు, నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని పవన్ ఎద్దేవా చేశారు. జగన్‌ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కాదని సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ గుండాలు రెచ్చిపోతే ఎముకలు విరగ్గొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నట్లు చెప్పిన పవన్, 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే, అంకెలు లెక్కపెట్టవద్దని విపక్షాలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న పవన్, నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు అంటూ కితాబ్ ఇచ్చారు. ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చానని అన్నారు.
జగన్ బతుకు నాకు తెలుసు : కోట్లు సంపాదించే స్కిల్స్ ఉన్నా అన్నీ కాదనుకుని వచ్చానని, రెండు చోట్ల ఓడిపోయాననే నిరాశ నాలో ఉన్నా ప్రజలకోసం పని చేస్తున్నట్లు తెలిపారు. యువత ఉద్యోగాల కోసం మాత్రం కండక్ట్ సర్టిఫికెట్లు కావాలి, గూండా ఎమ్మెల్యేలకు ఎలాంటి కండక్ట్ సర్టిఫికెట్లు అక్కర్లేదని ఎద్దేవా చేశారు. మన కండక్ట్ ఇచ్చే నాయకులు, మన కంటే ఉన్నతంగా ఉండాలని పవన్ హితవు పలికారు. తాను ఒక్కడినే అంటున్న జగన్, మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర లబ్ధి కోసమే ఉంటాయని పవన్ వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పొత్తులు పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగుదేశం -జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ బతుకు తనకు తెలుసని పవన్ ఎద్దేవా చేశారు.
టీడీపీ-జనసేన సభకు భారీ స్పందన - 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు