Hydra Commissioner Ranganath visits Several Ponds: తెలంగాణలోని చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా మరోసారి దృష్టి పెట్టింది. తక్షణమే వాటిని తొలగించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు పట్ల హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నగరంలోని పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసి స్థానికుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. చెరువుల వద్ద ఆక్రమణలను తొలగించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టు కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా నీటి వనరుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే 27 చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా కొన్ని రోజులపాటు కూల్చివేతలకు దూరంగా ఉంది. ఈ సమయంలో మేథావులు, విశ్రాంత ఇంజినీర్లు, న్యాయ నిపుణులు, పర్యావరణ ప్రముఖులతో సుదీర్ఘ సమావేశాలు నిర్వహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల పునరుద్దరణపై ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు.
మనసు చంపుకొని ఇళ్లు కూల్చాల్సి వస్తోంది: హైడ్రా కమిషనర్ రంగనాథ్
అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం: ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా బాచుపల్లిలోని ఎర్రకుంట చెరువును పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకున్నారు. ఆ చెరువులోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి వ్యర్థాలను తొలగించిన హైడ్రా అక్కడ తదుపరి కార్యాచరణను మొదలుపెట్టింది. ఆ ప్రాంతాన్ని రంగనాథ్ మరోసారి సందర్శించి అక్కడ చేయాల్సిన అభివృద్ధిపై స్థానికులు, అధికారులతో చర్చించారు. అలాగే స్థానికుల ఆహ్వానం మేరకు బండారి లేఔట్‌ను సందర్శించిన రంగనాథ్ సమీపంలోని తుర్క చెరువును పరిశీలించారు. చెరువులో ఆక్రమణలతోపాటు కలుషితనీరు కలుస్తుందని ఫిర్యాదు చేశారు. చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన రంగనాథ్ తుర్కచెరువు అభివృద్ధి కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని తెలిపారు.
మాదాపూర్‌లోని మేడికుంట చెరువు, ఈదులకుంట, నార్సింగ్‌లోని నెక్నాంపూర్ చెరువు, తెల్లాపూర్ లోని వనం చెరువు, చెల్లికుంట, మేళ్ల చెరువులను పరిశీలించి స్థానికుల ఇచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఈదులకుంట చెరువును పరిశీలించిన రంగనాథ్ విలేజ్ మ్యాప్‌ను పరిశీలించారు. ఖానామెట్ సర్వే నెంబర్ 7లో 6 ఎకరాల 5 గుంటల విస్తీర్ణంలో ఉన్న చెరువులో ఓ స్థిరాస్తి సంస్థ భవన వ్యర్థాలతో పూడ్చేస్తుందని సీపీఎం నాయకులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా విలేజ్ మ్యాప్‌ను పరిశీలించిన రంగనాథ్ రెవెన్యూ అధికారుల వద్ద ఉన్న పూర్తి డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తానని తెలిపారు.
మరోసారి రంగంలోకి హైడ్రా - అమీన్పూర్లో అక్రమ నిర్మాణం కూల్చివేత
చర్యలు చేపడతామని స్థానికులకు హామీ: ఈదులకుంట చెరువుపై పూర్తి వివరాలను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులను రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు. గతంలో సర్వే చేసిన రిపోర్టులను పునఃపరిశీలించారు. ఈదులకుంట చెరువు ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని, ఆ చెరువు పునరుద్దరణకు అన్ని చర్యలు చేపడతామని స్థానికులకు హామీ ఇచ్చారు. నగర పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలోనే చెరువులు కబ్జాలకు గురైనట్లు రంగనాథ్ అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పర్యటనలో రంగనాథ్‌కు స్థానికుల నుంచి రకరకాల ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
చెరువుల సుందరీకరణ పేరుతో కట్టల చుట్టూ నిర్మించి బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేస్తున్నారని, గేటెడ్ కమ్యూనిటీ ల నుంచి మురుగు చేరి చెరువులు కలుషితం అవుతున్నాయని స్థానికులు వివరించారు. మరోవైపు ఖాజాగూడలోని భగీరథమ్మ చెరువు అన్యక్రాంతంపై హైడ్రా అధికారులు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంధ్యా కన్వెన్క్షన్ యజమాని శ్రీధర్ రావు చెరువు బఫర్ జోన్లో మట్టివేసి పూడ్చివేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
2025 నాటికి హైదరాబాద్‌లోని చెరువులకు పూర్వవైభవం - బెంగళూరు తరహాలో పునరుజ్జీవం