MLC Venkataramana Resigns from MLC Post and YSRCP: వైఎస్సార్సీపీకి మరో షాక్ తగిలింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు భీమవరంలోని శాసనమండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.
ఈ క్రమంలో జయ మంగళ వెంకటరమణ మాట్లాడుతూ వైకాపా పార్టీలో ఇమడలేకపోయానని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన ఆ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆ పార్టీ నాయకులు ఏమాత్రం సహకరించలేదని వాపోయారు. సమస్యలు చెప్పుకునేందుకు జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. అధికారంలో ఎమ్మెల్సీగా పనిచేసిన సమయంలో తన అభిమానులను సొంత పార్టీ నాయకులే కొట్టి పోలీసు కేసులు పెట్టించినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మాట వినకూడదని పోలీసులకు ఆదేశాలిచ్చి ఎమ్మెల్సీగా గౌరవం కల్పించలేదని అన్నారు. కనీసం శాసనమండలిలో ప్రజా సమస్యలపై పోరాడుదాం అని కోరినా పట్టించుకోలేదన్నారు. ఏ సమస్య చెప్పినా బొత్స సత్యనారాయణ, ధనుంజయ రెడ్డిని కలవాలని సలహాలు ఇచ్చారని ఆరోపించారు. కొల్లేరు సమస్యను పరిష్కరించడంలో ఏమాత్రం ఇష్టపడలేదని వెంకటరమణ తెలిపారు. బీసీ నేతగా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతానని, ఏ పార్టీ అధినేతలైనా ఆహ్వానిస్తే అభిమానులతో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని జయ మంగళ పేర్కొన్నారు.
అర్ధరాత్రి నిద్రలేపి సంతకం చేయమన్నారు : బాలినేని
జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు - అదానీ ఒప్పందాలపై సమీక్షించాలి : షర్మిల